క్రికెట్ లో ఓపెనింగ్ జోడీలు ఉన్నట్లు.. బౌలింగ్ లో కూడా జోడీలు ఉన్నాయి. అదేంటి బౌలింగ్ లో జోడీలు ఏంటి? అనే అనుమానం రావొచ్చు. నిజమే! కానీ ఇక్కడ జోడీలు అంటే? ఒకే బ్యాట్స్ మెన్ ఒకే బౌలర్ చేతిలో ఎక్కువ సార్లు అవుట్ అవ్వడమే.. ఇక్కడ జోడీ అంటే. ప్రపంచ క్రికెట్ లో చూసుకున్నట్లైతే.. సచిన్-మెగ్రాత్, అక్తర్-ద్రవిడ్, మాక్స్ వెల్-చాహల్, గేల్-సందీప్ శర్మ ప్రస్తుతం భువీ-ఫించ్ లు ఎక్కువ సార్లు వీళ్ల బౌలింగ్ లోనే అవుటయ్యారు. అయితే ఈ జోడిలను మించిన మరో జోడీ ఉంది. అవును సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ గ్రేమ్ స్మిత్.. టీమిండియా స్టార్ బౌలర్ జహీర్ ఖాన్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జోడీలలో వీరు ఒకరు. “నా కెరీర్ లోనే నేనింత వరకు జహీర్ లాంటి బౌలర్ ను చూడలేదు” ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్. వీరిద్దరు హెడ్ టు హెడ్ తలపడగా ఎవరు పై చేయి సాధించారో క్షణ్ణంగా పరిశీలిద్దాం..
గ్రేమ్ స్మిత్.. దక్షిణాఫ్రికా క్రికెట్ లో ఓ సంచలనం. తన దైన ఆటతో అనతికాలంలోనే ఉన్నత దశకు చేరుకోవడమే కాక.. సౌతాఫ్రికా జట్టు పగ్గాలు సైతం చేపట్టాడు. ఇక అతడు కెప్టెన్ అయ్యాక ప్రోటీస్ జట్టు ఉన్నత స్థాయికి చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆస్ట్రేలియాతో 434 పరుగుల రికార్డు స్కోరు ఛేజింగ్ లో గిబ్స్ తర్వాత కీలక ఇన్నింగ్స్ స్మిత్ దే. ఇక తన బ్యాటింగ్ తో దక్షిణాఫ్రికాకు ఎన్నో మరపు రాని విజయాలను అందించాడు. ఇన్ని ఘనతలు సాధించిన స్మిత్ కు మాత్రం ఓ టీమిండియా బౌలర్ అంటే వణుకనే చెప్పాలి. అతడెవరో కాదు. టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్. అవును జహీర్ బౌలింగ్ కు వస్తున్నాడంటే స్మిత్ వణికిపోయిన రోజులున్నాయి.
ఈ క్రమంలోనే ఈ గణాంకాలు చూస్తేనే మీకు అర్ధం అవుతుంది.. స్మిత్ జహీర్ బౌలింగ్ లో ఎంత ఇబ్బంది పడ్డాడో అని. వీరిద్దరూ 27 మ్యాచ్ ల్లో హెడ్ టు హెడ్ తలపడగా.. 14 సార్లు జహీర్ బౌలింగ్ లోనే స్మిత్ అవుటయ్యాడు. జహీర్ బౌలింగ్ లో అతడి యావరేజ్ వచ్చి కేవలం 14.07 ఉండటం గమనార్హం. జహీర్ ఎప్పుడు బౌలింగ్ కు వచ్చినా గానీ స్మిత్ కనీసం 10 పరుగుల పైన చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు స్మిత్ రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. ఇదే విషయాన్ని ఓ సందర్బంలో స్మిత్ ప్రస్తావిస్తూ..”నేను జహీర్ లాంటి బౌలర్ ను ఇప్పటి వరకు చూడలేదు. అదీ కాక అతడు నైపుణ్యం ఉన్న బౌలర్.. ప్రత్యేకంగా అతడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల పాలిట ఓ సింహ స్వప్నం. అతడు బాల్ ను స్వింగ్ చేయడంలో, పేస్ ను రాబట్టడంలో సిద్దహస్తుడు. అతడి బౌలింగ్ లో కచ్చితంగా గార్డ్ పెట్టుకునే ఆడాలి అంటూ.. ప్రత్యర్థి ఆటగాళ్లకు సలహా ఇచ్చాడు. ఇక జహీర్ ఖాన్ తన కెరీర్ లో 200 వన్డే మ్యాచ్ ల్లో 282 వికెట్లు తీశాడు. ఇక 92 టెస్ట్ మ్యాచ్ ల్లో 311 వికెట్లు నేల కూల్చాడు.