భారతదేశం వేదికగా రోడ్ సేఫ్టీ సిరీస్ 2022 టోర్నీ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో ఆడుతున్న టీమిండియా లెజెండ్స్.. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న యువ ఆటగాళ్ల కంటే అద్భుతంగా ఆడుతున్నారు. వీళ్ల ఆట ముందు వయసు కూడా చిన్నబోయింది. సచిన్ తన క్లాస్ ఆటతో గత రోజులను గుర్తు చేస్తూంటే.. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. అతడి ప్రస్తుత ఆటని చూస్తుంటే.. ఇంగ్లాండ్ పై బాదిన సిక్సర్లే గుర్తుకు వస్తున్నాయి అంటే అతిశయెక్తి కాదు. దాంతో సోషల్ మీడియా వేదికగా లెజెండ్స్ కు ఇంకా వయసైపోలేదు.. అంటూ రాసుకొస్తున్నారు నెటిజన్స్. ఈ సిరీస్ లో అందరూ మాట్లాడుకునే వ్యక్తి యువరాజ్ సింగ్. ఈ వయసులోనూ అలవోకగా సిక్స్ లు బాదుతున్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
యువరాజ్ సింగ్.. 6 అడుగుల భారీ కాయం.. క్రీజ్ లోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. క్రీజ్ లో కుదురుకున్నాడు అంటే.. ఇక అంతే సంగతులు బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడతాడు. అలవోకగా సిక్స్ లు బాదడంలో యువీ సిద్దహస్తుడు. ఆ విషయం మనందరికి తెలిసిందే. ఇక టీమిండియాకు 2007టీ20 ప్రపంచకప్ ను అందించడంలో, 2011 వరల్డ్ కప్ అందించడంలోనూ యువీ కీలక పాత్ర వహించాడు. 2011 ప్రపంచ కప్ లోనే భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డ యువీ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ టోర్నీలో పాల్గొన్నాడు. వ్యాధి నుంచి కొలుకున్నాక జట్టులోకి వచ్చినప్పటికీ ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. ఈ క్రమంలోనే యువీ 2019 జూన్ 10 తన కెరీర్ కు వీడ్కొలు పలికాడు.
ప్రస్తుతం యువరాజ్ రోడ్ సేఫ్టీ సిరీస్ లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే 3 సిక్సులు, 1 ఫోర్ తో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో యువీ స్ట్రైక్ రేట్ 206 ఉండటం విశేషం. ఇక తన బ్యాటింగ్ సొగసు ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా నిరూపించాడు. అదే పవర్.. అదే స్టైల్.. ఇక ఈ మ్యాచ్ లో డేర్న్ బాచ్ వేసిన 11.4 బాల్ ని యువీ స్టాండ్ లోకి పంపిన విధానం చూస్తే అతడికింకా వయసైపోలేదు అనిపిస్తోంది. ఆ తర్వాత మేకర్ వేసిన 13 వ ఓవర్లలో 2 సిక్స్ లు బాదాడు యువీ. రెండు స్లో బాల్స్ వేయగా.. ఒకదాన్ని లెగ్ సైడ్ సిక్సర్ గా మలిచాడు. మరో బాల్ ను క్రీజ్ లో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయినా దాన్ని సిక్స్ గా మలిచిన విధానం అద్భుతం. ఈ వయసులో కూడా ఇలా సిక్స్ లు, ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తున్న.. యువీని చూసి ఫ్యాన్స్ యువీ సార్ మీకింకా వయసు కాలేదు.. మళ్లీ టీమ్ లోకి రావొచ్చు కదా? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మరి లేటు వయసులోనూ ఘాటు ఇన్నింగ్స్ లు ఆడుతున్న యువరాజ్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.