క్రికెట్‌కు జెంటిల్‌మెన్ గేమ్‌గా పేరుంది. ఆటగాళ్లు చాలా నిజాయితీగా, క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడుతారనే కీర్తి క్రికెట్ సొంతం. అయినా కూడా కొన్నిసార్లు అనుకోకుండా తప్పిదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో క్రీడా స్ఫూర్తి అనే అంశం తెరపైకి వస్తుంది. తాజాగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండు అంశాలపై వివాదం నెలకొంది. ఒకటి పంత్ పట్టిన క్యాచ్ అయితే.. రెండోది టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్ అయిన సమయంలో వ్యవహారించిన తీరు. ప్రస్తుతం ఈ రెండు అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది.
సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 45వ ఓవర్‌లో డస్సెన్ .. కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ నాలుగో బంతి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. డస్సెన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ కీపర్ చేతిలో పడింది. అయితే.. రిషభ్ పంత్ క్యాచ్ అందుకునే క్రమంలో బాల్ నేలకు తాకినట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది. మరో కోణంలో చేతిలో పడినట్లు ఉంది. దాంతో పలుకోణాల్లో పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని డస్సెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఇక ఈ సమయంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. డస్సెన్ అవుటైన తీరుపై తమ జట్టు మేనేజర్‌తో కలిసి అంపైర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. టీవీ రీప్లేలో భాగంగా ఫ్రంట్ కెమెరాను గమనించగా పంత్ చేతుల్లో పడటానికి ముందు బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. సైడ్ యాంగిల్‌లో మాత్రం క్యాచ్ పట్టినట్లు కనబడింది. ఇదే విషయాన్ని అంపైర్లకు చెప్పిన డీన్ ఎల్గర్.. తమకు అన్యాయం జరిగిందని వారి ముందు వాపోయినట్లు సమాచారం.
భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మార్కో జాన్సెన్ వేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని జాన్సెన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ షాట్ కోసం వెంటాడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఎయిడెన్ మర్కరమ్ ముందుకు డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. కానీ.. మర్కరమ్ క్యాచ్ పట్టడంపై సందేహం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్.. తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి నివేదించాడు.
టీవీ రిప్లేలను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. మర్కరమ్ క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలని తాకలేదని తేల్చాడు. అయితే.. రిప్లైలో కనిపించిన కొన్ని యాంగిల్స్‌లో మాత్రం బంతి మర్కరమ్ చేతుల ముందు బౌన్స్ అయినట్లు కనిపించింది. దాంతో.. రాహుల్ తాను నాటౌట్ అనే ధీమాతో కనిపించాడు. కానీ.. చివరికి థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో.. సహనం కోల్పోయాడు. పెవిలియన్‌కి వెళ్తూ దక్షిణాఫ్రికా టీమ్ , ఫీల్డ్ అంపైర్ల వైపు కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్లాడు. అతని మాటలకు సౌతాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ సైతం బదులివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే.. పంత్ క్యాచ్ ఎలా అయితే సౌత్ ఆఫ్రికాకి నష్టం చేకూర్చిందో, మర్కరమ్ క్యాచ్ అలాగే టీమిండియాకి నష్టాన్ని చేకూర్చింది. కానీ.., ఫీల్డ్ లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కబరిచిన సహనాన్ని.. టీమిండియా కెప్టెన్ గా రాహుల్ చూపించలేకపోయాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారీ సిక్స్ కొట్టిన బుమ్రా.. భార్య సెలబ్రెషన్ వీడియో వైరల్