ఇప్పటికే 74 సెంచరీలు బాదేసిన విరాట్ కోహ్లీ పేరిట ఇప్పటికే బోలెడు రికార్డులు ఉన్నాయి. కానీ.. 2013 నుంచి కోహ్లీ హాఫ్ సెంచరీ చేయలేదనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఒక్కప్పుడు ఆస్ట్రేలియాను వణికించిన కోహ్లీ.. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లొ ఐదు ఇన్నింగ్స్‌ల్లో విఫలం అయ్యాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 44. మొత్తం పరుగులు 111. ఈ సంఖ్యలు చూస్తుంటే కోహ్లీ స్థాయి బ్యాటింగ్ కాదని తెలిసిపోతుంది. 2020-21 మధ్య ఫామ్‌లేమితో తీవ్రంగా ఇబ్బంది పడ్డ కోహ్లీ.. ఆసియా కప్ 2022తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆ ట్రోర్నీలో ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. మరోసారి వింటేజ్ కోహ్లీని తలపించాడు. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌పై ఆడిన 82 పరుగులు ఇన్నింగ్స్ ఆడితే.. కోహ్లీ కెరీర్‌లోనే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా మూడో సెంచరీలు చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియాపై చిచ్చరపిడుగులా చెలరేగుతాడనుకుంటే.. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.
కోహ్లీ లాంటి ప్లేయర్ తుస్సుమనడంతో మూడో టెస్టులో టీమిండియా దారుణంగా ఓడింది. తొలి రెండు టెస్టుల్లో ఆల్‌రౌండర్ల అండదండలతో ఘనవిజయాలు సాధించిన టీమిండియా వాళ్లు విఫలం అయ్యేసరికే బొక్కబోర్లా పడింది. అయితే.. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. అది ఈ ఒక్క సిరీస్‌లోనే అనుకుంటే పొరపాటే.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయక 10 ఏళ్లు అయిందంటే.. నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆస్ట్రేలియాలపై టెస్టు మ్యాచ్‌ను ఇండియాలో ఆడుతూ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టి పదేళ్లు గడిచిపోయాయి. అప్పుడెప్పుడో 2013లో విరాట్ ఆస్ట్రేలియాపై స్వదేశంలో టెస్టు ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాపై వారి గడ్డపై బెబ్బులిలా చెలరేగే కోహ్లీ.. ఇండియాలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు.
2013 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై స్వదేశంలో 10 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన కోహ్లీ వరుసగా.. 0, 13, 12, 15, 6, 12, 44, 20, 22, 13 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇదే టైమ్ పిరియడ్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో పిచ్చికొట్టుడు కొట్టాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కోహ్లీ మంచి రికార్డులు ఉన్నాయి. కానీ, స్వదేశంలో ఆడే టెస్టుల్లో మాత్రం కోహ్లీ అంతగా రాణించడం లేదు. మరి అహ్మాదాబాద్ వేదికగా జరిగే చివరి టెస్టులోనైనా కోహ్లీ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాపై తన పరుగుల కరువు తీర్చుకోవాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli against Australia at Home pic.twitter.com/Uflu2I1XWI
— RVCJ Media (@RVCJ_FB) March 2, 2023