టీమిండియా.. టీ20 వరల్డ్ కప్2022 లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే కాకుండా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టును 13 పరుగులతో ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. ఈ వీడియోలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే? టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ వాటర్ బాయ్ గా మారి.. మైదానంలోని సహచర ఆటగాళ్లకు నీళ్ల బాటిళ్లను అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
“ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు” అన్న డైలాగ్ సరిగ్గా సరిపోతుంది కింగ్ కోహ్లీకి. టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మెన్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు.. ఇంతటి గొప్ప స్థాయి ఉన్న ఆటగాడు తాజాగా గ్రౌండ్ లో వాటర్ బాయ్ లాగా మారిపోయాడు. జట్టులో తన తర్వాత వచ్చిన వారికి, తన కంటే చిన్న వారితో భేదాభిప్రాయాలు లేకుండా.. ఎలాంటి ఇగోలకు తావివ్వకుండా.. తన స్థాయి నుంచి ఓ మెట్టు దిగి మరీ ప్రాక్టీస్ మ్యాచ్ లో వ్యవహరించాడు. ఇక ఈ మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ లో వికెట్ పడ్డాక.. టీమిండియా ఆటగాళ్లు అయితే దీపక్ హుడా, మరికొంత మందికి విరాట్ స్వయంగా వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బాటిల్స్ ఇవ్వడంలోనూ విరాట్ స్టైల్ ను ఫాలో అయ్యాడు. చాలా స్టైలిష్ గా బాటిల్స్ ను విసురుతూ.. నవ్వులు చిందించాడు.
మరో వైపు అశ్విన్ కూడా మిగతా ఆటగాళ్లకు బాటిల్స్ అందించాడు. ఇక ఈ వీడియో చూసిన విరాట్ అభిమానులు.. ఇది కదా అసలైన ప్రోత్సాహం అంటే! దిగ్గజ ఆటగాడు అయినప్పటికీ సహచర ఆటగాళ్లకు కొత్త కుర్రాళ్లలాగా మైదానంలోకి వాటర్ బాటిల్స్ తేవడం ఒక విధంగా అతడిలో ఉన్న నిస్వార్థాన్ని తెలియజేస్తుంది” అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. అయితే సహజంగా ఇలా వాటర్ అందించే పని జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రళ్లకు లేదా.. స్టాండ్ బై ఆటగాళ్లకు అప్పజెప్పుతారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్.. తన సేవలను జట్టుకు ఈ విధంగా అందిస్తూ.. ప్రేక్షకుల అభిమానాన్ని మరింతగా కొల్లగొడుతున్నాడనడంలో సందేహం లేదు.