టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో తొలిసారి విడాకులపై స్పందించాడు ధావన్. అలానే మరో సంచలన విషయం వెల్లడించాడు. తాను హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపాడు. ఎందుకు అంటే..
టీమీండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎనర్జీ లెవల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మైదానంలో ఎంత యాక్టీవ్‌గా ఉంటాడో.. బయట అలానే ఉంటాడు. క్రికెట్ కాకుండా.. శిఖర్ ధావన్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన మీసాలు, ఒంటి మీద ఉండే టాటూలు. ధావన్ ఒంటి మీద చాలా పచ్చబొట్లు ఉన్నాయి. తన శరీరాన్ని కాన్వాస్‌గా మలిచి.. టాటూలతో ఎన్నో డిజైన్లు వేయించుకున్నాడు ధావన్. తాజాగా ధావన్ ఇంటర్వ్యూ ఒకటి తెగ వైరలవుతోంది. దీనిలో ఆయన తన కెరీర్, వ్యక్తిగత జీవితం, విడాకులు, రెండో పెళ్లి, ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అలానే మరో సంచలన విషయం వెల్లడించాడు ధావన్. 14-15 ఏళ్ల వయసులో ఆయన హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్నట్లు వెల్లడించాడు ధావన్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ధావన్ ఎందుకు హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే..
ధావన్‌కు టాటూలంటే చాలా ఇష్టమనే సంగతి అందరికి తెలిసిందే. ఆయన ఒంటి మీద ఎన్నో టాటూలున్నాయి. వీటి కారణంగానే తాను హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది అన్నాడు ధావన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు 14-15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకుంటా.. మనాలీ వెళ్లాను. అప్పుడు నా కుటుంబ సభ్యులకు తెలియకుండా.. నా వీపు మీద టాటూ వేయించుకున్నాడు. కొన్ని రోజుల పాటు నేను టాటూ వెయించుకున్నట్లు ఎవ్వరికి తెలియనివ్వలేదు. అలా 3-4 నెలలు గడిచాయి. ఆ తర్వాత ఎలానో నేను టాటూ వేయించుకున్న సంగతి మా నాన్నకు తెలిసింది. దాంతో ఆయన నన్ను బాగా కొట్టారు’’ అని గుర్తు చేసుకున్నారు.
‘‘టాటూ వేయించుకున్న తర్వాత నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే.. నాకు టాటూ వేసిన సూదీతోనే.. ఇంకా ఎందరికి టాటూ వేసి ఉంటారో నాకు తెలియదు కదా. అందుకే నాలోనూ కాస్త భయం ప్రారంభం అయ్యింది. ఇక విషయం మా నాన్నకు తెలియడంతో.. ఆయన నన్ను తీసుకెళ్లి హెచ్‌ఐవీ టెస్ట్ చేయించారు. అదృష్టం నెగిటివ్ వచ్చింది’’ అని తెలిపాడు. ‘‘ఇక నేను మొదటగా వేయించుకున్న టాటూ స్కార్పియో అంటే తేలు బొమ్మ. అప్పుడు నా ఆలోచన అలానే ఉంది. ఆ తర్వాత దాని మీద డిజైన్ వేయించాను. నా చేతి మీద శివుడి టాటూ వేయించుకున్నాను. అలానే అర్జునుడి టాటూ కూడా వేయించుకున్నాను’’ అని తెలిపారు.
ప్రస్తుతం శిఖర్ ధావన్ టీమిండియాలో లేడు. ఫిట్‌నెస్ లేకపోవడం, ఫామ్ కోల్పోవడంతో.. జట్టు నుంచి తొలగించారు. ధావన్ ఐపీఎల్-2023 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్‌కు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఏప్రిల్ 1న పంజాబ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.