ఇప్పటికే దీప్తి శర్మ చేసిన మన్కడింగ్ రనౌట్ చర్చనీయాంశంగా మారగా.. మరో విచిత్రకరమైన రనౌట్ వీడియో వైరల్‌గా మారింది. మన్కడింగ్‌ను మించిన రనౌట్ అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు దీన్ని పేర్కొంటున్నారు. అసలు ఇంతకీ ఇది అవుటా? నాటౌటా? అనే చర్చ కూడా తీవ్రస్థాయిలో జరుగుతోంది. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ డిఫెన్స్ ఆడటంతో అది నెమ్మదిగా బౌలర్ చేతుల్లోకి వస్తుంది. దాన్ని తీసుకుని మళ్లీ తిరిగి బౌలింగ్ వేసేందుకు రిటన్ వస్తున్న బౌలర్.. వస్తూ వస్తు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లకు కొట్టడం, ఆ టైమ్‌లో నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో బ్యాటర్ కొంత ఏమరపాటుతో క్రీజ్ లైన్ బయట నిలబడి ఉండటంతో అంపైర్ దాన్ని రనౌట్‌గా ప్రకటించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ విచిత్రమైన రనౌట్ జూలై 30న ఈస్ట్ ఆంగ్లియా ప్రీమియర్ లీగ్‌లో చోటు చేసుకుంది. సఫరాన్ వాల్డెన్ క్రికెట్ క్లబ్-ఫ్రింటన్ ఆన్ సీ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫరాన్ ఆటగాడు బ్రైస్ స్ట్రీట్ బౌలింగ్‌లో బ్యాటర్ డిఫెన్స్ ఆడిన బంతి మెల్లగా బౌలర్ చేతుల్లోకి వస్తుంది. బౌలింగ్ వేసి ముందుకు వెళ్లిన స్ట్రీట్ ఆ బంతి తీసుకుని తిరిగి బౌలింగ్ వేసేందుకు వస్తున్నాడు. కానీ.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నిఖిల్ గోరంట్లా బాల్ ముగిసిపోయింది అనుకుని అలాగే నిల్చుండి పోతాడు. కానీ.. క్రీజ్ లైన్‌కు ఒక ఇంచు బయట ఉన్నాడు. అది గమనించిన బౌలర్ స్ట్రీట్ బంతిని నాన్‌స్ట్రైకర్ వైపు వికెట్లపై విసిరి.. అప్పీల్ చేయడంతో అంపైర్ దాన్ని రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని బ్యాటర్ నిఖిల్ చేసేదేం లేక పెవిలియన్ బాట పడతాడు.
కాగా.. ఇలా కూడా అవుట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. కానీ క్రికెట్‌లోని రూల్స్ ప్రకారం బంతి కీపర్ చేతుల్లోనో, లేదా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ చేతుల్లోనే బంతి ఉంటే ఆ బాల్ అక్కడితో ముగిసినట్లు. కానీ.. బ్యాటర్ డిఫెన్స్ ఆడిన బంతి బౌలర్ చేతుల్లో ఉంది. అదే టైమ్‌లో తనకు తెలియకుండానే బ్యాటర్ క్రీజ్ బయట ఉన్నాడు. దీంతో బౌలర్ రనౌట్ రూపంలో అవుట్ చేశాడు. రూల్ ప్రకారం ఇది అవుటే అయినా.. ధర్మం కాదని కొంతమంది క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా క్రికెట్‌కు సంబంధించిన రూల్స్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటివల మన్కడింగ్‌ను కూడా రనౌట్‌గా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: మన్కడింగ్ వివాదానికి పుల్‌స్టాప్! నిజం ఒప్పుకున్న ఇంగ్లండ్ బ్యాటర్