99 పరుగుల వద్ద అంపైర్ తప్పుడు నిర్ణయంతో అవుట్ అయినా.. ఎదురు చెప్పకుండా ఎంతో కూల్‌గా వెళ్లిపోయే క్రికెటర్ ఎవరంటే అందరు ముక్తకఠంతో చెప్పే పేరు సచిన్ టెండూల్కర్. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వివాదరహిత ఆటగాడిగా సచిన్‌కు పేరుంది. జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు సచిన్. ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కవ్వించినా కూడా ఎంతో శాతంగా సెంచరీలతోనే సమాధానం ఇచ్చే సచిన్‌కు పసికూన జింబాబ్వే ఆటగాడు మాత్రం విపరీతమైన కోపం తెప్పించాడు.
ప్రపంచ దిగ్గజ బౌలర్లు ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి జట్లతో చెడుగుడు ఆడిన సచిన్ ముందు కుప్పిగంతులు వేశాడు. అంతే.. క్రికెట్ దేవుడికి ఆగ్రహం కట్టులు తెంచుకుంది. ఆ కోపంలో సచిన్ కొట్టిన కొట్టుడికి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటివరకు క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న సచిన్ ఒక్కసారిగా విలయతాండవం ఆడుతున్నట్లు జింబాబ్వేపై మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. శాంతికాముడు సచిన్‌కు ఇంతలా కోపం రావడానికి కారణమైన ఆటగాడు హెన్రీ ఒలోంగా అసలు ఏం చేశాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!
1998 నవంబర్‌లో ఇండియా, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య షార్జా వేదికగా కోకాకోలా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇది మొత్తం ఏడు మ్యాచ్‌ల టోర్నీ. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఇండియా విజయం సాధించింది. అలాగే శ్రీలంక-జింబాబ్వే మధ్య జరిగిన రెండో మ్యాచ్ జింబాబ్వే గెలిచింది. మూడో మ్యాచ్‌లో జింబాబ్వేను భారత్ ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో మళ్లీ శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో శ్రీలంకపై జింబాబ్వే రెండో విజయం సాధిస్తుంది. దీంతో భారత్, జింబాబ్వే జట్లు ఫైనల్ చేరుతాయి.
అంతకంటే ముందు ఈ రెండు జట్ల మధ్య ఒక లీగ్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత కెప్టెన్ అజయ్ జడేజా జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తాడు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే 205 పరుగులు చేస్తుంది. ఆ టైమ్‌లో భారత బ్యాటర్లు ఉన్న ఫామ్‌కు ఇది పెద్ద టార్గెట్ కాదు. కానీ అనూహ్యంగా జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలోంగా చెలరేగి టీమిండియా టాప్‌ఆర్డర్‌ను కుప్పకూలుస్తాడు.
తన తొలి ఓవర్ తొలి బంతికే సౌరవ్ గంగూలీ(1)ని అవుట్ చేస్తాడు. తర్వాత ఓవర్‌లో రాహుల్ ద్రవిడ్(3)ను, తన మరుసటి ఓవర్ రెండో బంతికి సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేస్తాడు. కానీ.. అది నో బాల్ కావడంతో సచిన్ బతికిపోతాడు. కానీ.. తర్వాత బంతికే బౌన్సర్ వేయడంతో అనూహ్యమైన బౌన్స్‌ను అంచనా వేయలేక సచిన్ అవుట్ అవుతాడు. దీంతో ఎక్కడలేని సంతోషంతో హెన్రీ ఒలోంగా రెచ్చిపోతాడు. వెకిళి చేష్టలతో రోతపుట్టిస్తాడు.
సచిన్ లాంటి స్టార్ ప్లేయర్ వికెట్ తీస్తే సంతోషపడొచ్చు తప్పులేదు. కానీ.. అతి అనేది పనికిరాదు. ఇదే విషయంలో సచిన్‌కు కోపం వచ్చింది. కానీ.. సచిన్ తన కోపాన్ని మాటల్లో చూపించలేదు. తనకు తెలిసిన బ్యాటింగ్‌తోనే బుద్దిచెప్పాడు. ఆ వెంటనే జింబాబ్వేతో జరిగిన ఫైనల్‌లో ఒలోంగాను పిచ్చికొట్టుడు కొట్టాడు. కేవలం 92 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సులతో 124 పరుగులు చేసి దుమ్మురేపాడు. సచిన్ ఇంత ఆవేశంగా సిక్సులతో విరుచుకుపడటం అరుదు. సచిన్ విలయతాండవం చేస్తుంటే ఓపెనర్ సౌరవ్ గంగూలీ మరో ఎండ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సచిన్ మాత్రం పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. బాల్‌ను కసితీరా బాదాడు. దీంతో 197 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. గత మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టగానే కళ్లు నెత్తికెక్కిన ఒలోంగాను ఈ మ్యాచ్‌లో సచిన్ దారుణంగా దెబ్బకొట్టాడు. కేవలం 6 ఓవర్లు వేసిన ఒలోంగా ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా తనకు కోపం తెప్పించిన ఒలోంగాకు సచిన్ మాస్ ఇన్నింగ్స్‌తో బుద్దిచెప్పాడు. మరి ఒలోంగా చేసిన అతికి.. సచిన్ బుద్దిచెప్పిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.