టీ20 ప్రపంచ కప్ లో పోరాటం ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ టూర్ లో కివీస్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇప్పటికే తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ టూర్ కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు. దీంతో యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ ని ఉద్దేశించి మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్ లో రానున్న పదేళ్లలో భారత జట్టులో పంత్ కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డ ఊతప్ప, అతడిని టాపార్డర్ లో ఆడించాలని సూచించాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్ తో ముచ్చటించిన ఊతప్ప.. టీ20లలో రిషబ్ పంత్ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “న్యూజిలాండ్ సిరీస్ లో పంత్ ఓపెనర్ గా రావాలి. తనొక మ్యాచ్ విన్నర్. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్నవాడు. అలాంటి ఆటగాడు టాపార్డర్ లో వస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న పదేళ్లలో భారత టీ20 జట్టులో అతడు అత్యంత కీలక ప్లేయర్ గా ఎదుగుతాడు..” అని చెప్పుకొచ్చాడు.
అయితే.. దినేశ్ కార్తిక్ రీఎంట్రీ ఇచ్చాక పంత్ కు అవకాశాలు సన్నగిల్లాయి అనే చెప్పాలి. పంత్ రాణించకపోవడం, అనువజ్ఞుడైన డీకే వైపు యాజమాన్యం మొగ్గు చూపడంతో అతడికి వస్తున్న అవకాశాలు అంతంత మాత్రమే. టీ20 వరల్డ్ కప్ లో రెండు మ్యాచులు మాత్రమే ఆడిన పంత్, రెండింటిలో కలిపి 9 పరుగులు చేశాడు. జింబాబ్వేతో మ్యాచులో 3 పరుగులు చేసిన పంత్ ఇంగ్లండ్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పంత్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ లో పంత్ టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 64 అంతర్జాతీయ టీ20లు ఆడిన పంత్, 127 స్ట్రైక్ రేట్ తో 970 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో 98 మ్యాచులు ఆడిన పంత్, 147 స్ట్రైక్ రేట్ తో 2838 పరుగులు చేశాడు.