“కెరటమే నాకు ఆదర్శం.. పడినందుకు కాదు.. పడినా లేచినందుకు” అన్నాడు వివేకానందుడు. ఈ వాఖ్యం అచ్చంగా సరిపోతుంది రాబిన్ ఉతప్పకు. తాజాగా తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి వీడ్కోలు పలికాడు. అయితే అతడి జీవితం పూల పాన్పు కాదు.. ఎన్నో కష్టాలను, మరెన్నో సమస్యలను ఎదుర్కొని ఇప్పుడీ స్థాయిలో మన ముందు నిలుచున్నాడు. ఒకవైపు ఆరోగ్య సమస్యలు.. మరో వైపు తన కల సాకారం చేసుకోవాలన్న తపన. కృషి, పట్టుదలతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు రాబిన్. కలను అయితే సాకారం చేసుకున్నాడు కానీ భారత జట్టులో సుస్థిర స్థానాన్ని మాత్రం దక్కించుకోలేక పోయాడు. దీంతో అడపాదడపా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా అన్ని ఫార్మట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. రాబిన్ ఉతప్ప జీవిత విశేషాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం..
రాబిన్ ఉతప్ప.. టీమిండియాకు తొలి టీ20 ప్రపంచ కప్ అందించిన హీరోల్లో ఒకడు. ఉతప్ప స్వతహాగా క్రీడా నేపథ్యమున్న కుటుంబానికి చెందినవాడు. ఉతప్ప తండ్రి పేరు వేణు ఉతప్ప.. ఇతను ఇంటర్నేషనల్ హాకీ అంపైర్ గా పనిచేశాడు. అలాగే హాకీకి సంబంధించిన పలు బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. ఎలాగో క్రీడా నేపథ్యమున్న కుటుంబమే కాబట్టి.. ఉతప్ప కు అంత సులువుగా అవ కాశాలు ఏమీ రాలేదు. తండ్రి హాకీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ రాబిన్ తన కెరీర్ గా క్రికెట్ ను ఎంచుకున్నాడు.
ఇలా సాఫీగా సాగిపోతున్న ఉతప్ప జీవితంలో అనుకోని సంఘటన సంభవించింది. పదేళ్ల వయసులో ఉతప్పకు మూర్చ వ్యాధి వచ్చింది. దీంతో అతడి క్రీడా జీవితం ప్రశ్నార్థాకంగా మారింది. ఒక వైపు మూర్చ వ్యాధికి చికిత్స తీసుకుంటునే తన స్వప్నం అయిన క్రికెట్ ఆటను కొనసాగించాడు. అయితే చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. దీంతో ఉతప్ప బరువు పెరిగాడు. సమస్యలు అన్నీ ఒక్క సారిగా దండయాత్ర చేసినప్పటికీ అతడు ఏ మాత్రం బెదరలేదు. డాక్టర్ల సలహాలు తీసుకుంటేనే తన ప్రాక్టీస్ ను కొనసాగించాడు. అయితే ఈ సమస్య కొన్ని రోజులే అనుకుంటే మనం పొరపడినట్లే.. 10 ఏళ్ల వయసులో వచ్చిన ఈ వ్యాధి ఉతప్పను దాదాపు అతనికి 20 నుంచి 25 ఏళ్ల వరకు ఇబ్బందికి గురిచేసింది. కానీ ఏ మాత్రం చలించని ఉతప్ప తన లక్ష్యాన్నిమాత్రం మర్చిపోలేదనే చెప్పాలి.
గురువు లేని విద్య ఎన్నటికి వెలుగు లోకి రాదు అనే నిజం తెలుసుకున్న రాబిన్.. తన వ్యక్తిగత కోచ్ గా టీమిండియా వెంటరన్ ఆటగాడు అయిన ప్రవీణ్ ఆమ్రే ను నియమించుకున్నాడు. ఇక అప్పటి నుంచి అతడి దశ తిరిగిందనే చెప్పాలి. కోచ్ ఆమ్రే శిక్షణలో రాటుతేలిన రాబిన్ అనతి కాలంలోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో రాణించాడు. దీంతో భారత సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2004 అండర్-19 ప్రపంచ కప్ లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతి తొందర్లోనే సీనియర్ జట్టులోకి అడుగుపెట్టాడు. 2006లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. 12 టీ20ల్లో 249 పరుగులు చేశాడు. అయితే రాబిన్ కు మాత్రం టెస్ట్ ల్లో ఆడే అవకాశం దక్కలేదు.
ఇక రాబిన్ అంతర్జాతీయ క్రికెట్లో అతడి సెంచరీ కల తీరకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. 142 మ్యాచ్ ల్లో 22 శతకాలతో 9446 పరుగులు చేశాడు. 2013-14 సంవత్సరాన్ని రాబిన్ కెరీర్ లో అత్యుత్తమ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తన సొంత రాష్ట్రమైన కర్ణాటక రంజీ ట్రోఫీని గెలవడంలో అతడిది కీలక పాత్ర. అయితే 2007 టీ 20 ప్రపంచ కప్ తర్వాత పేలవ ఫామ్ తో జట్టులో నుంచి చోటును కోల్పొయాడు. అడపా దడపా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని వినియోగించుకోలేక పోయాడు.
అయితే IPLలో మాత్రం తన సత్తా చాటాడు. తన దూకుడైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2014లో కోల్ కత్త నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. జీవితంలో ఎన్నో సమస్యలు.. మరెన్నో ఆటుపోట్లు.. వీటన్నింటిని తట్టుకుని క్రీడా ప్రయాణం చేయడం అంత సులభమైన విషయం కాదు. ఈ విషయంలో రాబిన్ ఉతప్ప మనందరికి ఒకరకంగా ఇన్ స్పిరేషన్ అనే చెప్పాలి. మరి ఇంతటి కఠిన పరిస్థితుల్లో కూడా తన కెరీర్ ను కొనసాగించిన రాబిన్ ఉతప్పపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It has been my greatest honour to represent my country and my state, Karnataka. However, all good things must come to an end, and with a grateful heart, I have decided to retire from all forms of Indian cricket.
Thank you all ❤️ pic.twitter.com/GvWrIx2NRs
— Robin Aiyuda Uthappa (@robbieuthappa) September 14, 2022
ఇదీ చదవండి: Rishabh Pant: మాట మార్చిన ఊర్వశి రౌటేలా.. ‘సారీ చెప్పింది పంత్ కు కాదంటూ..’