ఈసారి ఐపీఎల్లో కొత్త రూల్స్‌ను ప్రవేశ పెడుతున్నారు. వీటి వల్ల ఆట మరింత ఆసక్తికరంగా మారుతుందని అంటున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన ఏమన్నాడంటే..!
ఈ ఏడాది ఐపీఎల్ అందరికీ మరింత వినోదాన్ని పంచేందుకు, ఉత్సాహపరిచేందుకు సిద్ధమవుతోంది. ఈసారి లీగ్‌లో కొత్త రూల్స్ తీసుకొస్తుండటంతో ఆటపై ఆసక్తి మరింత పెరగనుంది. నయా రూల్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏదైనా ఉందంటే.. అది ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనే. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలోనే ఐదుగురు ఆటగాళ్ల పేర్లను సబ్స్టిట్యూట్లుగా కెప్టెన్స్ వెల్లడిస్తారు. మ్యాచ్ మధ్యలో పరిస్థితిని బట్టి వీరిని గ్రౌండ్లోకి దింపుతారు. ఈ రూల్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల గేమ్‌లో ఆల్‌రౌండర్ల అవసరం లేకుండా పోతుందన్నాడు. ఈ రూల్ వల్ల వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, ప్రధాన బ్యాటర్లు, బౌలర్లకు మాత్రమే జట్టులో చోటు దక్కుతుందన్నాడు పాంటింగ్.
కొత్త రూల్ వల్ల ఆల్రౌండర్లకు భారీగా నష్టం జరుగుతుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రధాన బ్యాటర్లు, బౌలర్లను మాత్రమే తీసుకుంటారని ఆల్రౌండర్లకు ప్రాధాన్యం తగ్గుతుందని చెప్పాడు. ఏడో నంబర్లో బ్యాటింగ్ చేస్తూ.. అవసరమైతే రెండు ఓవర్లు బౌలింగ్ చేయగలిగే వారిని ఏ జట్టూ ఆడించదు. ఎందుకంటే వారి అవసరం ఏముంది? అని పాంటింగ్ క్వశ్చన్ చేశాడు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ఆయన మరింత లోతుగా విశ్లేషించాడు. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ చేయాలా? లేదా బౌలింగ్ చేయాలా? అని నిర్ణయించుకున్నప్పుడే.. ఏయే ఆటగాళ్లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా పిలవాలో డిసైడ్ అవ్వాల్సి ఉంటుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఏ సారథి అయినా తప్పకుండా రెండు వేర్వేరు జట్లతోనే టాస్కు వస్తాడని పేర్కొన్నాడు.