టీమిండియాపై సందర్భం ఉన్నా.. లేకున్నా అక్కసు వెళ్లగక్కే పాక్ ఆటగాళ్లలలో ముందుంటాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రజా. ఇప్పుడు అతడిపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ప్లేయర్స్, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. దానికి కారణం ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో పాక్ దారుణంగా ఓడిపోవడమే. మూడు టెస్టుల సిరీస్ లో 2-0తో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పీసీబీ ఛైర్మన్ అయిన రమీజ్ రజాపై అలాగే పాక్ కెప్టెన్ బాబర్ పై పాక్ ఫ్యాన్స్ పీకలదాక కోపంతో ఊగిపోతున్నారు. పాక్ వరుసగా పరాభవాల పాలవుతుండటంతో వీరిద్దరి తప్పించాలి డిమాండ్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా పీసీబీ చైర్మన్ గా రజాను తొలగించనున్నారని వార్తలు జోరందుకున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రమీజ్ రజా.. అవసరం ఉన్నా, లేకపోయినా.. సందర్భం ఐనా, కాకపోయినా.. టీమిండియాపై విమర్శలు చేస్తూ.. ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. కానీ ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డ్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం PCB ఛైర్మన్ పదవి నుంచి అతడిని తొలగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్బంగా పీసీబీ మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ..”బోర్డులో ఏదో జరగబోతోంది. దానికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథీ మరోసారి బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బోర్డ్ లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రమీజ్ రజాను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది” అని మాజీ సభ్యుడు చెప్పుకొచ్చాడు.
అంతేకాదు క్రికెట్ బోర్డ్ లో రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లు ఉన్నాయని అక్కడి క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే 2018లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పడగానే పీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశాడు నజామ్ సేథీ. దానికి కారణం పీసీబీ ఛైర్మన్ ను దేశ ప్రధాన మంత్రి నామినేట్ చేయడమే. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుడు అవ్వగా.. అతడి స్థానంలో షెహ్ బాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చాడు. దాంతో రజాను తప్పించి నజామ్ సేథీకి పీసీబీ బోర్డ్ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు అక్కడ హల్ చల్ చేస్తున్నాయి.