ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే కొందరికి స్టార్ హోదాను కట్టబెడుతుంది. మెగాస్టార్ అంటే టాలీవుడ్ నంబర్ 1 హీరో. సచిన్ అంటే క్రికెట్ దేవుడు. రోజర్ ఫెదరర్ టెన్నిస్ కింగ్. ఇందిరా గాంధీ అంటే.. దేశ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన నేత.. ఇలా వీరంతా ఆయా రంగాల్లో గుర్తింపు దక్కించుకున్న విజేతలు. కానీ.. లియోనెల్ మెస్సీ చరిత్ర ఇంతకు మించింది. మెస్సీ అంటే కేవలం ఫుట్‌బాల్‌లో మెరిసిన విజేత మాత్రమే కాదు, ఆ ఫుట్‌బాల్‌కే కొత్త వెలుగులు తెచ్చిపెట్టిన ఓ అద్భుతం.
ఫుట్‌బాల్ మైదానంలో పాదరసంలా కదిలే మెస్సీ.. మిడ్‌ఫీల్డర్‌గా ప్రత్యర్థికి చిక్కకుండా మెరుపుతీగలా దూసుకెళ్లగలడు. డిఫెండర్‌ను మించి బాల్‌ను హోల్డ్ చేస్తూ.. పాస్ చేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్ల మైండ్ బ్లాంక్ చేయగలడు. మెస్సీ అంటే మెరుపు వేగంతో కొట్టే గోల్సే కాదు.. బాల్‌ను ఫెవిక్విక్ వేసి తన బూట్‌కు అంటిపెట్టుకున్నట్లు సైతం ఆడగలడు. గోల్స్ చేయడమే కాకుండా.. ఆటగాళ్ల మైండ్‌తో కూడా ఆడుకుంటాడు. అసలేం జరుగుతుందో సైతం ప్రత్యర్థి ఆటగాళ్లకు అర్థం కాకుండా గోల్స్ చేయడం మెస్సీకే సాధ్యం. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మెస్సీ విన్యాసాలు చూసేందుకే చాలా మంది క్యూకడుతుంటారు. అలాంటి ఆటగాడికి ఉన్న ఒకే ఒక లోటు ఫిఫా వరల్డ్ కప్. ఆ లోటు కాస్త.. ఖతర్ వరల్డ్ కప్‌లో తీరిపోయింది. మెస్సీ చేతుల్లో వరల్డ్‌కప్ చూసి.. ఫుట్‌బాల్ ప్రపంచం మురిసిపోయింది.
ఫుట్‌బాల్ రారాజు..
లియోనెల్ మెస్సీ.. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు. ఫుట్‌బాల్ గురించి తెలియనివారికి కూడా తెలిసిన పేరు మెస్సీ. దాదాపు దశాబ్దకాలంగా ఈ పేరు వినిపిస్తున్నా.. నిన్న(ఆదివారం) మాత్రం దిక్కులు పిక్కటిల్లేలా, ఖతర్ దేశం పులకించేపోయేలా ప్రతిధ్వనించింది. మనదేశంలో ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణలేకపోయినా.. ప్రపంచ మొత్తం ఈ ఆటటంటే పడిచచ్చిపోతుంది. మన దగ్గర క్రికెట్ ఎలాగో.. ప్రపంచంలోని 200 పైగా దేశాల్లో ఫుట్‌బాల్ అలాగ. క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ ఎలాగో.. ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ అలాగే. 20 ఏళ్ల కెరీర్ తర్వాత ప్రపంచ కప్‌ను ముద్దాడి.. సచిన్ మైమరిపోయినట్లు.. మెస్సీ కూడా 16 ఏళ్ల అద్భుతమైన కెరీర్ తర్వాత ప్రపంచ కప్‌ను ముద్దాడి.. ఫుట్ బాల్ ప్రపంచానికి రారాజుగా నిలిచాడు.
ఖతర్‌లోని లుసైల్‌లో ఫ్రాన్స్-అర్జెంటీనా దేశాల మధ్య ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ జనాభాలో 70 శాతం మంది టీవీలకు అతుక్కుపోయారు. ఫుట్‌బాల్ ప్రపంచానికి యువరాజులా ఉన్న లియోనెల్ మెస్సీ.. వరల్డ్ కప్ గెలిస్తే చూడాలని, అర్జెంటీనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆకాంక్షించారు. అనుకున్నట్లుగానే.. మెస్సీ తొలి గోల్‌తో ప్రపంచ కప్ వైపు అడుగేశాడు. కానీ.. ప్రత్యర్థిగా ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ కూడా అంత తేలిగ్గా మెస్సీకి వరల్డ్ కప్ వదిలేసే రకం కాదు. కానీ.. కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమైన మెస్సీకి అది అడ్డుతగిలింది కానీ.. అడ్డుకోలేకపోయింది. ఫుట్‌బాల్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనంత ఉత్కంఠతో జరిగిన ఈ ఫైనల్స్.. క్రీడాభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య పెనాల్టీ షూట్ అవుట్‌లో 4-2తో అర్జెంటీనా ఛాంపియన్‌గా నిలిచింది.
16 ఏళ్ల తర్వాత నెరవేరిన కల..
2006లో ఫుట్‌బాల్ కెరీర్ ఆరంభించిన మెస్సీకి వరల్డ్ కప్ నెగ్గడమే జీవితాశయం. 2014లో దాని అంచుల వరకు వెళ్లాడు. కానీ.. ఫైనల్లో ఓడిపోవడంతో మెస్సీ గుండె ముక్కలైంది. నిజానికి మెస్సీ ఆడుతున్న తీరు చూస్తే.. 2014లోనే అర్జెంటీనా మరోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయంగా కనిపించింది. అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాలర్ మారడోనాతో మెస్సీని పోలుస్తుంటారు. కానీ.. 1986లో మారడోనా అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించాడు.. కానీ మెస్సీకి ఆ వెలితి అలాగే ఉండిపోయింది. ఒక్క వరల్డ్ కప్ విషయం పక్కన పెడితే.. ఏడు బాలన్స్ డి’ఓర్, నాలుగు ఛాంపియన్స్ లీగ్‌లు, ఒక కోపా అమెరికా, బార్సిలోనాతో 10 లాలిగా టైటిల్స్, ప్యారిస్ సెయింట్-జర్మైన్‌తో ఫ్రాన్స్‌లో ఒక లీగ్ 1.. ఇలాంటి గొప్ప విజయాలు ఎన్నో మెస్సీ బూట్‌ను ముద్దాడాయి. కానీ.. వరల్డ్ కప్ అనే ఒకే ఒక అద్భుతం మాత్రం మెస్సీని వరించలేదు.
వరల్డ్ కప్ లేకపోయినా.. ఫుట్‌బాల్‌లో మెస్సీ ఒక లెజెండ్. ఫుట్‌బాల్ ఆటకు పీలేను దేవుడిలా భావిస్తారు. అలాగే మరో దిగ్గజం మారడోనా సైతం ఫుట్‌బాల్‌కు ఫేస్‌గా ఉన్నారు. అలాంటి మారడోనాతో మెస్సీని పోల్చుతుంటారు. అలా పోల్చిన ప్రతిసారి.. ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శ.. వరల్డ్ కప్ ఏది?. 2014 ఫైనల్లో ఓడిన సమయంలోనే మెస్సీ.. వరల్డ్ కప్ కల చెదిరిపోయింది. కానీ.. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా.. తిరిగొచ్చి.. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఎన్నో గొప్ప విజయాలతో ప్రపంచ టాప్ ఫుట్‌బాలర్‌గా ఉన్న మెస్సీ.. ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచానికి రారాజుగా పట్టాభిషేకం పొందాడు. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి.. 15 అంగుళాల బంగారు కప్పును ఎంతో అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నాడు.
ఇక ఫైనల్స్‌లో తొలి గోల్ కొట్టిన మెస్సీ.. ప్రపంచంలో మరె ఆటగాడు సాధించలేని అరుదైన రికార్డును సాధించాడు. గ్రూప్ దశలో, రౌండ్ ఆఫ్ 16లో, క్వార్టర్ ఫైనల్స్‌లో, సెమీ ఫైనల్స్‌లో, ఫైనల్‌లో తొలి గోల్ కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో అర్జెంటీనా తరఫున మొత్తం 21 గోల్స్ చేసిన మెస్సీ.. మొత్తం కెరీర్‌లో 793 గోల్స్ చేశాడు. అలాగే 2014లో ఫైనల్లో ఓడినా.. మెస్సీకి గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఈ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇలా రెండు సార్లు గోల్డెన్ బాల్ అందుకున్న తొలి ఆటగాడిగా మెస్సీ కొత్త చరిత్ర లిఖించాడు. ఈ వరల్డ్ కప్ విజయంతో ఫుట్‌బాల్ ఉన్నంత కాలం.. అర్జెంటీనా ఆడినంత కాలం.. మెస్సీ పేరు మారుమోగుతూనే ఉంటుంది. మెస్సీ వరల్డ్ కప్ గెలవడంతో అతని కల తీరిందని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి మెస్సీ వరల్డ్ కప్ గెలవడం గొప్ప కాదు.. మెస్సీ చేతుల్లో ఒదిగి వరల్డ్ కప్ మురిసిపోయింది.
Lionel Messi celebrated in the same way as Diego Maradona 🥹 pic.twitter.com/7uCLO8gxhv
— KYSTAR (@KYSTAR) December 18, 2022