ఐసీసీ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ కప్ షెడ్యూల్ మీద టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మ్యాచ్‌ల షెడ్యూల్ విషయంలో భారత జట్టుకు తీరని అన్యాయం జరిగిందని వాళ్లు ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో జరగబోయే ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి దాదాపు మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఆ ఫీవర్ మొదలైంది. స్వదేశంలో జరిగే టోర్నీలో టీమిండియా ఎలాగైనా కప్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2011లో ఇలాగే ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్‌ను భారత్ గెలిచింది. మరోసారి ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్-2023 షెడ్యూల్ భారత ఫ్యాన్స్‌లో ఆందోళన రేపుతోంది. ఐసీసీ రిలీజ్ చేసిన వరల్డ్ కప్ షెడ్యూల్ టీమిండియా కొంప ముంచేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. స్వదేశంలో టోర్నీ జరుగుతున్నప్పటికీ వేదికల విషయంలో భారత్‌కు అన్యాయం జరిగిందని అభిమానులు చెబుతున్నారు. మన జట్టు ఆడబోయే 9 మ్యాచులను 9 వేర్వేరు వేదికల్లో నిర్వహిస్తున్నారు.
మెగా టోర్నీలో ఇన్ని స్టేడియాల మధ్య ప్రయాణిస్తూ, ఇన్ని చోట్ల ఆడే ఏకైక టీమ్ భారత్ ఒక్కటే కావడం గమనార్హం. లీగ్ దశలో ఆడే మ్యాచ్‌ల కోసం టీమిండియా ప్లేయర్లు ఏకంగా 8,400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కొన్ని మ్యాచ్‌లకు అయితే రెండు, మూడు రోజుల గ్యాప్‌లో వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఆడాల్సి ఉంది. కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు ప్రయాణాలతోనే అలసిపోయే పరిస్థితి. దీంతో ప్రయాణ బడలికతో భారత ప్లేయర్లు ఎలా ఆడతారోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు మిగతా జట్లు మాత్రం కొన్ని నగరాల్లో వారం రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉంది. దీంతో వాళ్లు చక్కగా రెస్ట్ తీసుకొని, అక్కడి పిచ్‌ను అర్థం చేసుకొని పూర్తి సామర్థ్యంతో ఆడే అవకాశం ఉంది. ఇది తెలిసిన ఫ్యాన్స్.. మ్యాచ్‌ల షెడ్యూల్ విషయంలో ఐసీసీ కావాలనే భారత్‌కు అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. టీమిండియాకు విశ్రాంతి అనేదే లేకుండా వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఫిక్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.