‘ప్రపంచ కప్..’ దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పే సందర్భం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీని ఏ జట్టైనా గెలవాలని కోరుకోవడం సహజమే. అలాంటి ఎన్నో ఆశలతో 21 ఏళ్ల నిషేధం తర్వాత 1992 ప్రపంచ కప్ లో అడుగుపెట్టిన సౌతాఫ్రికాకు ఆ వరల్డ్ కప్ ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. మ్యాచ్ గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టనున్నాం అన్న సమయంలో అంపైర్లు, బ్రాడ్ కాస్టర్లు చేసిన పనికి సెమీస్ లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా జట్టుకు ప్రపంచ కప్ ను దూరం చేసిన ఆ సంఘటన తెలియాలంటే ఇది చదవాల్సిందే. మనకు తెలిసినంత వరకు క్రికెట్ ప్రపంచాన్ని శాశించేది.. ఐసీసీ, ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. కానీ,1992 ప్రపంచ కప్ ను ఒక బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ శాశించింది. వాళ్ళు చెప్పిందే వేదం. కాదంటే ప్రత్యక్ష ప్రసారం ఆపేస్తాం. ఈ తరహాలో వ్యవహరించింది.
ఈ చర్యలు.. ఒక దేశానికి ప్రపంచ కప్ ను దూరం చేశాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. 1992 వన్డే ప్రపంచకప్ సందర్బంగా ఇంగ్లాండ్ – సఫారీ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ పోరు. ‘తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా.. ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. ఇంతలోనే పెద్ద ట్విస్ట్. సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేశారు అంపైర్లు.
సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా స్క్రీన్ పై డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం చేయాలో అర్థం కాలేదు. అంపైర్లు ప్రకటించినట్లుగా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. ఇక్కడ ‘1 బంతికి 22 పరుగులు చేయాలన్న నిర్ణయం అంపైర్లు తీసుకున్నా.. దీని వెనుకుంది మాత్రం ఆ మ్యాచును ప్రత్యక్ష ప్రసారం చేసిన బ్రాడ్ కాస్టింగ్ ఛానల్’. అప్పటి రూల్స్ ప్రకారం.. సెమీఫైనల్ పోరులో వర్షం అంతరాయం ఏర్పడితే రిజర్వు డే రోజు ఆ మ్యాచును తిరిగి నిర్వహించవచ్చు. కానీ, ఆ నిబంధనను.. అప్పటి ప్రపంచ కప్ నిర్వహించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తుంగలో తొక్కేసింది. అందుకు కారణం.. ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు కూడా అర్హత సాధించకుండా ఇంటిదారి పట్టడమే.
దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు బ్రాడ్ కాస్టింగ్ ఛానల్.. మ్యాచ్ రిజర్వు డే రోజు నిర్వహిస్తామంటే.. మేము ఒప్పుకోము. మ్యాచ్ ఆన్ టైంలోపే జరిగిపోవాలి.. అన్నట్లు అల్టిమేటం జారీచేసింది. అందుకు కారణం.. డబ్బు. దీంతో అంపైర్లు కూడా ఏం చేయలేకపోయారు. వీరు తీసుకున్న ఈ తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కోత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. 1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమల్లోకి వచ్చింది. ఏదేమైనా.. ఒక బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ కారణంగా ఒక దేశం ఒక ప్రపంచ కప్ దూరమయ్యిందంటే.. బాధించదగ్గ విషయమే.