బర్మింగ్‌హామ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు అనూహ్యంగా మలుపు తిరిగింది. తొలి రోజు అర్ధభాగం నుంచి భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఇప్పుడు ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మొత్తానికి అసలు సిసలైన టెస్టు మజాను క్రికెట్ అభిమానులకు పంచుతోంది. తొలి మూడు రోజులు పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. నాలుగో రోజు మాత్రం పూర్తిగా తడబడింది. తొలి సెషన్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా.. మిగతా రెండు సెషన్లు పూర్తిగా చేతులెత్తేసింది.
భారత్ విధించిన 378 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్ లీస్(65 బంతుల్లో 8 ఫోర్లతో 56), జాక్ క్రాలీ(76 బంతుల్లో 7 ఫోర్లు 46) 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా.. జానీ బెయిర్ స్టో(72 బ్యాటింగ్), జోరూట్(76 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో భారత బౌలర్లు తేలిపోయారు. బుమ్రా(2/52) మినహా మరెవరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
వికెట్ సైతం పూర్తిగా ఫ్లాట్‌గా మారడం ఇంగ్లండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 119 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. భారత్‌కు ఏడు వికెట్లు కావాలి. ఆట చివరి రోజు మంగళవారం ఫస్ట్ సెషన్ ఆటలో మ్యాచ్ ఫలితం తేలనుంది. వర్షం అంతరాయం కలిగించి చివరి రోజు ఆట రద్దయితే మ్యాచ్ డ్రా కానుంది. డ్రా అయినా గెలిచినా ఐదు టెస్ట్‌ల సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఓడితే మాత్రం సమం అవుతోంది. 125/3 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. బెన్ స్టోక్స్(4/33) అద్భుత బౌలింగ్‌తో భారత్ పతనాన్ని శాసించాడు.
ఓవర్ నైట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(66)భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవ్వగా.. రిషభ్ పంత్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఇతర బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(27), మహమ్మద్ షమీ(13), జస్‌ప్రీత్ బుమ్రా(7) చేతులెత్తేయడంతో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కు తోడుగా స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పోట్స్ రెండేసి వికెట్లు తీయగా.. అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు.
పిచ్‌పై రచ్చ..
గెలుస్తుందనుకు మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా ప్రయాణిస్తుండడంతో ఎడ్జ్‌బస్టన్ పిచ్‌పై చర్చ జరుగుతోంది. భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిగా బౌలర్లకు సహకరించిన వికెట్.. ఇంగ్లండ్ బ్యాటింగ్ టైమ్‌లో మాత్రం బౌలర్లకు వ్యతిరేకంగా మారిపోయింది. భారత బ్యాటింగ్ టైమ్‌లో బంతి స్వింగ్ అవ్వగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా వికెట్ ఫ్లాట్‌గా మారింది.
విజయం ఖాయం అనుకున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు తడబడుతుండటం చూసి అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. వసీం జాఫర్ సైతం పిచ్ ఇంతలా మారడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఫన్నీ మీమ్‌ను ట్వీట్ చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో గ్రౌండ్స్‌మెన్ రోడ్ రోలర్‌తో పిచ్‌ను తొక్కించి ఉంటారని పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Groundsman rolling the Edgbaston pitch during inns break 😅 #ENGvIND pic.twitter.com/OMRdplkDwt
— Wasim Jaffer (@WasimJaffer14) July 4, 2022