టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ గురించి క్రీడాలోకానికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఇక సచిన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ సైతం క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి మనందరికి తెలిసిందే. మరి అంతటి దిగ్గజ ఆటగాడి కొడుకుగా అర్జున్ పై ఉండే ఒత్తిడి అంతా.. ఇంతా కాదు. మరి ఈ ఒత్తిడిని తట్టుకుని అర్జున్ కు కోచింగ్ ఇవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి. మరి అంతటి బాధ్యతను తీసుకోవాలి అంటే ఎంతో అనుభవం ఉన్న కోచ్ అయితేనే అర్జున్ భవిష్యత్ బాగుంటుంది అని భావించిన సచిన్.. యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ అయితేనే కోచ్ గా సరైన వ్యక్తి అని నమ్మి అతని దగ్గరకు పంపించాడు. ఈ క్రమంలోనే తన దగ్గరికి సచిన్, యువరాజ్ వచ్చి ఏం మాట్లాడారో వివరించాడు యువీ తండ్రి యోగ్ రాజ్.
యోగ్ రాజ్.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ తండ్రిగా క్రీడాలోకానికి సుపరిచితుడే. కానీ అతడో గొప్ప కోచ్ అని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. టీమిండియాలో ఉన్న చాలా మంది క్రికెటర్లు యోగ్ రాజ్ దగ్గర శిష్యరికం చేసిన వారే. ఈ నేపథ్యంలోనే తన కొడుకును సైతం అతడి దగ్గర కోచింగ్ నేర్పించడానికి యువీ సాయం కోరాడు సచిన్. అవును అర్జున్ టెండుల్కర్ కు కోచింగ్ ఇవ్వమని సచిన్, యువీలు ఇద్దరు కలిసి వెళ్లి యోగ్ రాజ్ ను రిక్వెస్ట్ చేశారు. దాంతో అతడు వారి అభ్యర్థనను కాదనలేక అర్జున్ కు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. సచిన్ లాంటి గొప్ప వ్యక్తే వచ్చి అడగడంతో నేనే కాదనలేకపోయా. అర్జున్ రంజీ ట్రోఫీ ప్రాంరభానికి 20 రోజుల ముందే నా దగ్గరికి వచ్చాడని యోగ్ రాజ్ తెలిపాడు.
అనంతరం అర్జున్ వచ్చిన తొలి రోజే మైదానం చుట్టూ 10 రౌండ్లు పరిగెత్తించాడు. ఆ తర్వాత నెట్స్ లో అతడి బౌలింగ్ ను దగ్గరుండి పరీక్షించాడు. ఆ క్రమంలో అతడి బౌలింగ్ లో లోపాలను గమనించి సరిచేశాడు. ఇక ప్రస్తుతం యోగ్ రాజ్ కోచింగ్ లో రాటుతేలిన అర్జున్ టెండుల్కర్.. తొలి రంజీ మ్యాచ్ లోనే దుమ్మురేపుతున్నాడు. ఆడిన అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. అటు బౌలింగ్ లో సైతం రాణిస్తున్నాడు అర్జున్ టెండుల్కర్. ఈ సందర్బంగ అర్జున్ ఆటతీరును మెచ్చుకున్నాడు కోచ్ యోగ్ రాజ్. అర్జున్ వరల్డ్ క్రికెట్ లో గొప్ప ఆటగాడు అవుతాడని కితాబిచ్చాడు. ఇక అర్జున్ ను వదులుకుని ముంబై తప్పుచేసిందని, త్వరలోనే వారికి ఈ విషయం తెలిసివస్తుందని యోగ్ రాజ్ చెప్పుకొచ్చాడు.