ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇక షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో.. తెలంగాణలో చేపట్టిన పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో షర్మిలను అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
‘‘మా పాదయాత్ర చూస్తే.. సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంది. పాదయాత్రకు వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకనే.. మాపై దాడులు చేస్తున్నారు. పైగా మామీదే కేసులు పెట్టి.. ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నాకు ప్రాణహాని ఉంది. నా పార్టీ పైకి రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్, ఆయన గుండాలు కుట్రలు చేస్తున్నారు. నన్ను పాదయాత్ర చేయనీయకూడదని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. మా వాహనాలను తగులబెట్టి మమ్మల్నే సారీ చెప్పమంటారా.. ఇదేం న్యాయం’’ అని ప్రశ్నించారు.
‘‘వాహనాలపై దాడి చేసి.. వాటిని ఏ విధంగా నాశనం చేశారో సీఎం కేసీఆర్‌కు చూపించేందుకు వెళ్తుంటే.. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద అరెస్ట్ చేసి.. రిమాండ్ కోరారు. కోర్టు నుంచి అనుమతులు ఉన్నప్పటికి.. నా పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఇది నియంత పాలన. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారు.. వారికి అంతా అర్ధమవుతోంది. బండి సంజయ్ యాత్ర సజావుగానే సాగుతుంది. నా పాయయాత్రను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు’’ అని ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించారు.
అలానే ఢిల్లీ లిక్కర్ స్కాంపై కూడా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సీఎం కుమార్తె.. కల్వకుంట్ల కవిత ఒక ఆడ మనిషి అయి ఉండి లిక్కర్ స్కామ్ చేస్తారా.. మీ ఇంట్లోని మహిళలు లిక్కర్ స్కామ్‌లు చేస్తారు. ఇక్కడ నేను పాదయాత్ర చేస్తే సానుభూతి లేదు. కారును లాక్కొని వెళ్లి… పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడతారా.. మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా’’ అని సూటిగా ప్రశ్నించారు షర్మిల.