తెలంగాణ గవర్నర్‌కి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలాలేదు. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి అంటే ఫామ్ హౌస్‌లు కట్టడం కాదు అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు వేసింది గవర్నర్. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో.. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది. తమిళిసై తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. కానీ ఇప్పటి వరకు గవర్నర్ తమిళిసై నుంచి బడ్జెట్‌కు సంబంధించి ఎలాంటి ఆమోదం లభించలేదు. దాంతో ప్రభుత్వం.. గవర్నర్ తీరుపై కోర్టులో.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది. బడ్జెట్‌కు అనుమతి ఇవ్వాలని ఈ నెల 21న గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా.. బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, దానికి సంబంధించిన కాపీ తమకు పంపారా.. లేదా.. అని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి తిరిగి లెటర్ రాసింది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ప్రక్రియను గవర్నర్ తమిళిసై కూడా పెండింగ్‌లో పెట్టారు.
గతంలో గవర్నర్ ప్రసంగం లేనప్పటికీ బడ్జెట్‌కు తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ సారి మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇక గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపాలని కోరుతున్నారు. మరి బడ్జెట్ వివాదానికి చివరకు ఎలాంటి ముగింపు రానుందో చూడాలి. మరి తెలంగాణలో నెలకొన్న గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.