కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎన్నికల సంఘం.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించనుంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ తరఫున బరిలో దిగుతున్న రాజగోపాల్ రెడ్డి కూడా తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాడు. బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి అందించాడు రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కోమటిరెడ్డి ఆస్తుల విలువ గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ కీలకంగా మారింది.
ఇక రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ 274 కోట్ల రూపాయలుగా ఉంది. ఈసీకి అందించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తంలో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా.. చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ 274 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. ఇక తనకు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి అఫిడవిట్‌లో చూపించారు. అలానే తన భార్య పేరుపై రూ.52.44 కోట్ల ఆస్తులు ఉన్నట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
ఉపఎన్నిక నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఆస్తులపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరకుముందే.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కించుకున్నారని.. క్విడ్ ప్రోకు పాల్పడ్డారని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా ఇదే అంశంపై రాజగోపాల్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. తాను కాంట్రాక్టు పొందినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆస్తుల వివరాలు వెల్లడించడంతో ఈ ఆరోపణలు ఎలా టర్న్ అవుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక మునుగోడు బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి తరఫున డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో స్రవంతి, ఆమె భర్త పేరు మీద 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు చూపించారు. అలానే స్రవంతి పేరున 6 లక్షలు, ఆమె భర్త పేరు మీద 55 లక్షల రూపాయల అప్పు ఉన్నట్లు వెల్లడించారు.