ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం మరింత హీటెక్కుతుంది. ఓ వైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు మూడు రాజధానులు రావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు విశాఖపట్టణంలో మాత్రమే ఉన్నాయని అన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించిన ధర్యాన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇతర వర్గాల వారు.. అమరావతిలో నివసించే పరిస్థితులు లేవని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్రను అభివృద్ధికి దూరం చేసి.. ఇక్కడి ప్రజల హక్కులను టీడీపీ కాలరాస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను అభివృద్ధి చేస్తామంటే.. చంద్రబాబుకు అంత బాధ ఎందుకు. టీడీపీ హయాంలో.. ఉత్తరాంధ్ర నుంచి అభివృద్ధి అవకాశాలను ఉద్దేశపూర్వకంగా దూరం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు మంచి చేయాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంకెన్నాళ్లు.. నీ బినామీల కోసం ప్రజలను దోచుకుంటావు. రాష్ట్ర ప్రజలు కోరుకునే సమానమైన అభివృద్ధిని టీడీపీ వ్యతిరేకిస్తోంది. కాబట్టి మా వికేంద్రీకరణ చర్యను వ్యతిరేకించే హక్కు వారికి లేదు’’ అంటే మంత్రి ధర్మాన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే విశాఖ రాజధాని సాధనే లక్ష్యంగా మేధావులు, జర్నలిస్టులు, ఉత్తరాంధ్ర ప్రముఖులు అంతా కలిసి జేఏసీగా ఏర్పడిన విషయం తెలిసిందే. దీని ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 15న ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ చేపట్టిన అమరావతి మహా పాదయాత్రకు పలు ప్రాంతాల్లో నిరసన సెగ తగులుతోంది.