YS Jagan Mohan Reddy: పరిపాలనా వీకేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణతోనే గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరి నుంచి జిల్లాల సంఖ్యను 26కు పెంచటం వరకు అన్ని అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. గురువారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటి వద్దకే రేషన్ సరుకుల పథకం దేశానికే మార్గ దర్శకంగా మారింది. విపత్తులు వచ్చినా సంక్షేమ పథకాలు ఎక్కడా కుంటుపడలేదు. సమర్థవంతంగా పనిచేశాం. ఇది కేవలం పరిపాలనా వికేంద్రీకరణ వల్లే సాధ్యపడింది. 10 వేల కోట్ల కంటే తక్కువ పెట్టుబడితో విశాఖపట్టణాన్ని సుందరమైన రాజధానిగా తీర్చిదిద్దవచ్చు.
ఇది గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం అంచనా వేసిన మొత్తంలో కేవలం పది శాతం మాత్రమే. నాకు అమరావతిపై ఎలాంటి వ్యతిరేకత లేదు. అమరావతిలో రాజధాని తీసేయాలని నేను అనలేదు. విశాఖ, కర్నూలులో కూడా పెట్టాలన్నాను. రైతులంటే 35 వేల ఎకరాలు ఇచ్చిన వారు మాత్రమే కాదు. రైతు భరోసా అందుకుంటున్న 50 లక్షల మంది కూడా రైతులే. ప్రభుత్వం దృష్టిలో రాష్ట్రం అంటే కేవలం 8 కిలోమీటర్ల భాగం మాత్రమే కాదు.. మొత్తం 1.62 లక్షల చ.కి.మీ కూడా. బాబు ఎలాంటి అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలు చేస్తున్నారు. అమరావతి గురించి రకరకాలుగా డ్రామాలు జరుగుతున్నాయి. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి.. 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమానికి, రియల్ ఎస్టేట్ ఉద్యమానికి తెర తీశారు.
ఇతర ప్రాంతాలను రెచ్చ గొడుతూ.. ఈ రోజు ఒక డ్రామాను నడుపుతున్నారు. దశాబ్ధాలుగా నిర్మించుకున్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కూడా.. కట్టని, కట్టలేని ఈ అమరావతి వీరి దృష్టిలో చాలా గొప్పది. ఎవరి అభివృద్ధి కోసం వీరంతా ఉద్యమాలు చేస్తున్నారు?. ఎస్సీల కోసమా.. ఎస్టీల కోసమా.. బీసీల కోసమా.. లేక ఓసీల్లోని పేద ప్రజల కోసమా.. కాదే.. టీడీపీ కోసం ఉద్యమం చేస్తున్నారు. పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే ఉద్యమం చేస్తున్నారు. చంద్రబాబు హాయాంలో జగనన్న అమ్మ ఒడి లాంటి పథకం ఎందుకు లేదు? వైఎస్సార్ ఆసరా లాంటి పథకం ఎందుకు లేదు? చేయూత, రైతు భరోసా లాంటి పథకాలు ఎందుకు లేవు. నవరత్నాల ద్వారా లక్షా 65 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమచేశాం.
కరోనా సమయంలో కూడా ఆపలేదు. టీడీపీ హయాంలో, ఇప్పుడు ఒకే బడ్జెట్. కానీ, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అప్పుడు ఎందుకు లేదు? డబ్బులు ఎవరి జేబిలోకి వెళ్లాయి?.. ఆ రోజు దోచుకో.. పంచుకో.. తినుకో పథకం ఉండింది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. దోచుకోవటం పంచుకోవటం జరిగింది. అన్ని వ్యవస్థలు కూడా నా మనుషుల చేతుల్లోనే ఉండాలనేది ఆ పెత్తందారుల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది ఆ పెత్తందారుల మనస్తత్వం. నాకు అమరావతిపై ఎలాంటి కోపం లేదు. అయినా ఎందుకు కోపం ఉండాలి? ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనేది నా ఆకాంక్ష’’ అని అన్నారు. మరి, పరిపాలనా వికేంద్రీకరణపై సీఎం జగన్ ఇచ్చిన స్పష్టతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కుప్పం గడ్డపై అడుగుపెట్టబోతున్న జగన్! ఇరకాటంలో చంద్రబాబు!