మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. జీ20 సన్నాహక సదస్సులో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జీ20 సన్నాహక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సన్నాహక సదస్సులో సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజినీ, ఆదిమూలపు సురేష్ లు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదస్సులో భాగంగా ఆర్కే బీచ్ లో మారథాన్ సాహస క్రీడలు ప్రారంభమయ్యాయి. ఇందులో మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజినీ, తదితరులు పాల్గొన్నారు. జీ20 సదస్సు సన్నాహక మారథాన్ ను ఉదయం మంత్రులు ప్రారంభించారు.
5కే, 10కే మారథాన్ లను ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు మంత్రి ఆదిమూలపు సురేష్ ను పారా గ్లైడింగ్ రైడింగ్ చేయమని కోరారు. నిర్వాహకుల కోరిక మేరకు ఆయన పారా గ్లైడింగ్ మొదటి రైడ్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. గాలి దిశ సహకరించకపోవడంతో రైడ్ ప్రారంభమైన వెంటనే కుదుపులు ఏర్పడ్డాయి. ఇసుక తిన్నెల్లో పక్కకు ఒరిగిపోయింది. అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. మంత్రి వ్యక్తిగత సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై కలెక్టర్ మల్లికార్జున అసహనం వ్యక్తం చేశారు.