టాలీవుడ్ హీరో నాగార్జున గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లామర్‌లో నేటి తరం కుర్ర హీరోలకు ఆయన గట్టి పోటీ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల్లో హీరోగా చేస్తూనే.. రియాలిటీ షోకు వ్యాఖ్యతగా కూడా వ్యవహిస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలు ఇవే తన లోకంగా ఉంటారు. ఏ పార్టీకి అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. కాకపోతే వ్యక్తిగతంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో అక్కినేని నాగార్జున కనిపించడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. అలానే అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని వైఎస్ జగన్ జైలుపాలైనప్పుడు, నాగార్జున జైలుకెళ్లి ఆయనను కలిశారు. ఇలా వైఎస్ కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధమే ఉంది.
ఈ క్రమంలో తాజాగా నాగార్జునకు సంబంధించి పొలిటికల్ సర్కిళ్లలో ఓ వార్త తెగ వైరలవుతోంది. అది ఏంటంటే.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున బరిలో దిగనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త అటు ఫిల్మ్ నగర్‌లోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఏపీ రాజకీయాల్లో బెజవాడ ఎంపీ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి అన్ని పార్టీలు. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం రెండు సార్లు.. ఇక్కడ ఓటమినే చవి చూసింది. 2014, 2019 రెండు సార్లు బెజవాడలో టీడీపీ తరఫున కేశినాని ఎంపీగా విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన టీడీపీ దూరంగా ఉండటం.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో.. టీడీపీ డైలమాలో పడింది. నాని పోటీ చేయకపోయినా సరే.. మరో బలమైన అభ్యర్థిని బరిలో దించి 2024లో కూడా బెజవాడ ఎంపీ స్థానాన్ని గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ భావిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా సరే బెజవాడలో తమ జెండా ఎగురవేసి.. టీడీపీ విజయానికి గండి కొట్టాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.
2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా బెజవాడలో మాత్రం టీడీపీ విజయం సాధించడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. అందుకే ఈ సారి ఎలాగైనా సరే.. బెజవాడలో గురి తప్పకుండా విజయం సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 2014లో టైమెక్స్ ప్రసాద్, 2019లో పొట్లూరి వరప్రసాద్ వైసీపీ తరఫున బెజవాడ నుంచి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో బెజవాడ నుంచి పీవీపీ పోటీ చేస్తారా లేదా అనే దాని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది
ఒకవేళ పీవీపీ చివరి నిమిషంలో పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటే.. బెజవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా నాగార్జునను బరిలో దించాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ టికెట్‌ను నాగార్జునకు కేటాయించనున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో తాను రాజకీయాలకు దూరమని ప్రకటించిన నాగార్జున.. ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. విజయవాడ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.