థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటులు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నారు. త్వరలో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన పుట్టినరోజు కావడంతో మెగా బ్రదర్ నాగబాబుని కలిసిన పృధ్వీ.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వైఎస్సార్‌సీపీ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డానని, కానీ తాను కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు ఆ పార్టీ నుండి ఒక్కరు కూడా రాలేదని, తనతో మాట్లాడలేదని అన్నారు.
పెట్ డాగ్స్‌కున్నంత పరిజ్ఞానం తనకు లేకుండా పోయిందని, అందుకే వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరానని అన్నారు. తనను వాడుకుని బయటకు గెంటేశారని, సినిమా అవకాశాలు లేని తనను మెగా ఫ్యామిలీ ఎంతగానో ఆదుకుందని అన్నారు. ఇక నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ కోసమే పని చేస్తానని, ఆయన కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమని అన్నారు. నాయకుడంటే పవన్ కళ్యాణ్‌లా ఉండాలని అన్నారు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. మరి త్వరలోనే జనసేన కండువా కప్పుకోనున్న పృధ్వీరాజ్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.