నేను రాజకీయాల నుంచి దూరం అయినా.. పాలిటిక్స్ నా నుంచి దూరం కాలేదంటూ గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి చెప్పిన డైలాగ్‌లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఈ డైలాగ్స్‌కి అర్థం ఏంటి.. అంటే చిరంజీవి ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారా.. ఒకవేళ ఆయన నిర్ణయం అదే అయితే.. మరి త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారా.. లేక తమ్ముడు జనసేనకు సపోర్ట్ చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిరంజీవికి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ సందర్భంగా చిరంజీవికి.. ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు జనసేనకు మద్దతిస్తారా’’ అనే ప్రశ్న ఎదురయ్యింది. అందుకు చిరంజీవి బదులిస్తూ.. ‘‘జనసేనకు మద్దతిస్తానో లేదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నా తమ్ముడి నిబద్ధత, నిజాయతీ నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు మనకు కావాలి. నా ఆకాంక్ష కూడా అదే. దానికి నా మద్దతు ఉంటుంది. మేం రాజకీయాల్లో చెరోవైపు ఉండటం కంటే కూడా.. నేను తప్పుకోవడమే తనకు మేలు అవుతుందేమో. భవిష్యత్తులో తను ఏ పక్షాన ఉంటాడు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ రాష్ట్రాన్ని ఏలే రోజు రావాలని.. ప్రజలు తనకు ఆ అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్‌కు భవిష్యత్తులో మద్దతిస్తానేమో’’ అన్నారు చిరంజీవి. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.