నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరు గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీపైనే ఆయన విమర్శలు చేశాడు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేయడంతో.. ఈ విషయం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి కోటంరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభం అయ్యాయి. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నిరసనకు దిగారు. అంతేకాక అసెంబ్లీలో తనకు మైక్ ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే కోటంరెడ్డి తీరుపై వైసీపీ నేతలు మండి పడ్డారు. మంత్రి అంబటి అయితే.. ఏకంగా ఆయనను నమ్మకద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారంటూ అంబటి విమర్శించారు. కోటంరెడ్డికి ఇప్పుడు టీడీపీ, చంద్రబాబుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా.. కోటంరెడ్డి ఓ నమ్మకద్రోహి.. చద్రబాబు, టీడీపీ, మెప్పు కోసం ఆయన పని చేస్తున్నారు అంటూ అంబటి నిప్పులు చెరిగారు.
‘‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే.. ఆయన అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువ లేని వ్యక్తి, నమ్మకద్రోహి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పు కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.. నమ్మకద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి.. కోటంరెడ్డిపై నిప్పులు చెరిగారు.
అలానే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కోటంరెడ్డి తీరును తప్పు పట్టారు. ఇది వ్యక్తిగత సమస్యలు పరిష్కరించే వేదిక కాదన్నారు. ఏ వేదికలో ఏ అంశాలను ప్రస్తావించాలనేది తెలుసుకోవడం ముఖ్యం అని తెలిపారు. అంతేకాక బడ్జెట్ సమావేశాల్లో వ్యక్తిగత అంశాలపై చర్చకు శ్రీధర్ రెడ్డి పట్టుబట్టడంప సరి కాదు అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమస్యలపై సంబంధిత మంత్రులకు కానీ, తనకు కానీ వినతిపత్రాలు అందిస్తే వాటిని పరిష్కరిస్తామని బుగ్గన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం సమానంగా చూస్తుందని ఈ సందర్భంగా బుగ్గన స్పష్టం చేశారు. ఇక కోటంరెడ్డి నిరసన తెలుపుతున్న సమయంలోనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. మరి అంబటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.