ఇంటర్నేషనల్ డెస్క్- వాట్సాప్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సుల ఊహించికోలేము. సోషల్ మీడియాలో వాట్సాప్ విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఇద్దరు వ్యక్తుల నుంచి మొదలు వ్యవస్థల వరకు అంతా ఇప్పుడు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేనిదే ఎవ్వరికి ఏ పని తోచదు. అన్నీ వాట్సాప్ లో జరగాల్సిందే.
ఐతే ఒక్కసారిగా వాట్సాప్ భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. అవును సుమారు 17 లక్షల భారతీయుల వాట్సాప్ అకౌంట్స్ ను కంపెనీ నిషేదించింది. గత సంవత్సరం నవంబరు నెలకు సంబంధించి వాట్సాప్ విడుదల చేసిన యూజర్ల భద్రతా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.గత యేడాది నవంబర్ నెలలో 17.59 లక్షల ఖాతాలపై వేటు వేసినట్టు ఆ నివేదికలో పేర్కొంది.
యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా ఖాతాలపై నిషేధం విధించింది. ఈ అంశానికి సంబందించి యూజర్ల నుంచి అదే నెలలో 302 వినతులు కూడా వచ్చినట్టు వాట్సాప్ తెలిపింది. అంతకు ముందు నెల అక్టోబరులో 2 మిలియన్లకు పైగా ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వాట్సాప్‌కు ఇండియాలో 400 మిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు.
కస్టమర్ల భద్రతను కాపాడేందుకు ఏళ్ల తరబడి తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. మరోవైపు డేటా సైంటిస్టులు, నిపుణులు కూడా పనిచేస్తున్నట్టు తెలిపింది. మామూలుగానే సేవల దుర్వినియోగాన్ని గుర్తించేందుకు వాట్సాప్ లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ చేస్తున్న సమయంలో, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లకు స్పందించడం ఆధారంగా ఖాతాలను గుర్తించి నిషేధిస్తుంటుంది. రానున్న రోజుల్ల ఈ అంశంపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని వాట్సాప్ స్పష్టం చేసింది.