విధి ఆడే వింతనాటకంలో మనం కేవలం పాత్రధారులమని, ఆడించేది.. ఆ దేవుడు మాత్రమే.. అని పెద్దలు అంటుంటారు. అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడు అది నిజమనే అనిపిస్తుంది. తాజాగ నాగర్ కర్నూల్ లో జరిగిన ఘటన అలాంటిదే. ఓ తల్లి.. తన నెలల పసికందుకు పాలిస్తూనే.. తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగర్‌కర్నూల్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీ (25) తొలి కాన్పు కోసం తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలోని తన పుట్టింటికి వచ్చింది. రెండు నెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డా ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇటీవల జయశ్రీకి స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త ప్రశాంత్..మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె గుండె వాల్వులో చిన్న ఇబ్బంది ఉందని, మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో మళ్లీ నేరళ్లపల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో జయశ్రీ.. తన బిడ్డకు పాలిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది.
కాసేపటికి తాత, అమ్మమ్మ టీ కోసం పిలిచినా ఆమె లేవలేదు. అనుమానంతో వారు పరిశీలించగా.. మృతి చెందినట్లు గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. జయశ్రీ తల్లిదండ్రులు, అత్తమామలు తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లడంతో.. వృద్ధులు వెంటనే ఆమె భర్తకు సమాచారమిచ్చారు. అక్కడి చేరుకున్న ప్రశాంత్ భార్య మృతదేహాన్ని కంటతడి పెట్టుకున్నాడు. ఘటనతో ఏమితెలియని ఆ పసికందు.. తల్లిలేని బిడ్డగా మారింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.