స్పోర్ట్స్ డెస్క్- ఒమిక్రాన్.. ఈ కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సందిగ్దంలో పడిన టీం ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికా వెళ్లనుంది. ఐతే ముందుగా నిర్ణయించిన మేరకు డిసెంబరు 17 నుంచి కాకుండా, డిసెంబరు 26 నుంచి సిరీస్ ఆరంభం మొదలవునుంది. ఇదే సమయంలో నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రస్తుతానికి వాయిదా పడింది.
టీం ఇండియా పర్యటన నేపథ్యంలో టెస్టు, వన్డే సిరీస్ కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు టీ20 సిరీస్‌ను వచ్చే ఏడాది 2022లో నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు పేర్కొంది. రీషెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని క్రికెట్ సౌతాఫ్రికా స్పష్టం చేసింది.
టీంఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్ కొత్త షెడ్యూల్
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ 2021-23లో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌లు..
డిసెంబరు 26-30: సూపర్‌స్పోర్ట్ పార్క్- సెంచూరియన్
జనవరి 03-07: ఇంపీరియల్ వాండరర్స్- జొహన్నస్‌బర్గ్
జనవరి 11-15: సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్- కేప్‌టౌన్
టీంఇండియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్..
జనవరి 19: యూరోలక్స్ బోలాండ్ పార్క్- పర్ల్
జనవరి 21: యూరోలక్స్ బోలాండ్ పార్క్- పర్ల్
జనవరి 23: సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్- కేప్‌టౌన్
ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఓడించి భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోహ్లి సేన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.