ఈ మధ్యకాలంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లోని ఓ లాడ్జీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 8 మరణించిన విషయం తెలిసిందే. ఇలా అనేక అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు అగ్నికీలలకి ఆహుతి అవుతున్నారు. తాజాగా ఆర్ధిక రాజధాని ముంబ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని చెంబూర్ లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భారీగా చుట్టుపక్కల పొగ కమ్ముకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ భవనంలో అనేక మంది చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల ద్వారా బయటకి వచ్చే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని ముంబై నగరంలో చెంబూర్ ప్రాంతంలోని తిలక్ నగర్ ప్రాంతంలో 12 అంతస్తుల భవనంలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని 12వ అంతస్తులోని ఓ ఇంట్లో షార్ట్ సర్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ అగ్నికీలల ధాటికి చుట్టు పక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ పొగ ధాటికి బయటకి వచ్చే దారులు కనపడక చాలా మంది భవనంలో చిక్కుకున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో బాల్కనీలకు వేలాడుతూ దిగేందు ప్రయత్నాలు చేశారు. భవనం విజువల్స్ చూస్తే.. చాలా మంది చేతులు ఊపుతూ రక్షించాలంటూ వేడుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరుణంలో తమని కాపాడమని భవనంలోని వారు అధికారులను వేడుకున్నారు. అగ్నిమాప సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.