చీరలంటే ఆడవారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఉన్నా సరే.. కొంటూనే ఉంటారు. మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందనో.. పక్క వాళ్ల దగ్గర ఉన్న మోడల్ చీర తమ దగ్గర లేదనో.. ఇలా ఏదో ఓ కారణం చెప్పి.. కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పండగల సీజన్లలో ఆడవాళ్లు చేసే చీరల షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని.. బట్టల షాపులు.. ఆషాఢం, శ్రావణ మాసాల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. కొన్ని ఏళ్లుగా కిలో సేల్‌ని కూడా అమలు చేస్తున్నాయి. ఇవన్ని బాగా క్లిక్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో ఓ బట్టల దుకాణం మరో సరికొత్త ఆఫర్‌కు తెర తీసింది. కేవలం 1 రూపాయికే పట్టు చీర అని ప్రకటించింది. 50 శాతం ఆఫర్ అంటేనే మన జనాలు ఆగరు.. ఇక రూపాయికే పట్టు చీర అంటే.. వారిని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. వార్త తెలిసిన వెంటనే జనాలు షాప్‌కు క్యూ కట్టారు. చీరల కోసం తోపులాటను సైతం లెక్క చేయలేదు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన శ్రీ వెంకటేశ్వర సిల్క్స్ షోరూం.. రూపాయికే పట్టుచీర అనే బంపరాఫర్ ప్రకటించింది. షోరూమ్ ప్రారంభించి ఏడాది పూర్తి కావడంతో.. వార్షికోత్సవం సందర్భంగా ఈ ధమకా ఆఫర్ ప్రకటించింది. ఇక ఆటో డ్రైవర్లకు అయితే ఉచితంగా పట్టు వస్త్రాలు ఇస్తున్నట్లు.. ఇవే కాక షాప్‌లో ఇంకెన్నో ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఇది చూసిన జనాలు.. షాప్‌కు బారులు తీరారు. ఆటో డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున షాప్ దగ్గరకు చేరుకున్నారు. జనాలను అదుపు చేయడం కోసం పోలీసులను రంగంలోకి దించినా లాభం లేకపోయింది.
ఇక మహిళలయితే ఉదయమే షాపు వద్దకు చేరుకుని ఎదురు చూడసాగారు. ఇక షోరూమ్ షట్టర్ తెరవగానే బిలబిలమంటూ లోపలికి తోసుకెళ్లారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. కానీ పట్టు చీర మీద మోజుతో గాయాలను సైతం లెక్క చేయకుండా తోసుకుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై ఈ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.