భార్య గురించి చులకనగా మాట్లాడేవాళ్లనే ఎక్కువగా చూస్తాం. కానీ చాలా అరుదుగా భార్యను అమితంగా ప్రేమించే భర్తలకు సంబంధించిన వార్తలు తెర మీదకు వస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆవివరాలు..
దేవుడు మనిషిని సృష్టించి.. ఒంటరిగా వదిలేయకుండా అతడికి తోడుగా కొన్ని బంధాలను కూడా ఇచ్చాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇవన్ని పుట్టుకతో వచ్చే బంధాలు. కానీ భార్యాభర్తల బంధం పూర్తిగా వేరు. మనం ఏరి కోరి తెచ్చుకునే బంధం. తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఎందరు ఉన్నా సరే.. వారంతా జీవిత భాగస్వామికి సాటి రారు. అందుకే యవ్వనంలో ఉండగా పెళ్లి వద్దనుకున్న వారికి సైతం జీవితంలో ఏదో ఒక దశలో పెళ్లి చేసుకుంటే బాగుండు.. మనకంటూ ఓ తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. యవ్వనంలో ఉన్నప్పటి కంటే జీవిత మలి దశలోనే తోడు విలువ బాగా అర్థం అవుతుంది.. మనకంటూ ఓ తోడు ఉంటే బాగుండు అనిపించేది కూడా అప్పుడే.
అయితే మన సమాజంలో చాలా మందికి భార్య అంటే ఎంతో చులకన అభిప్రాయం. గౌరవ మర్యాదలు కాదు కదా.. కనీసం తాను కూడా మనిషే అని గుర్తించరు. స్నేహితులు, బంధువుల దగ్గర తమ భార్య గురించి ఎంత చులకనగా మాట్లాడితే అంత గొప్ప అని ఫీలయ్యే భర్తలు ఎందరో ఉన్నారు. అలాంటి మూర్ఖుల సంగతి పక్కకు పెడితే.. భార్యను అమితంగా ప్రేమించేవారు కూడా ఎందరో ఉన్నారు. అనారోగ్యం పాలై మంచాన పడిన భార్యను కన్న కూతురులా కంటికి రెప్పలా చేసుకున్న భర్తల గురించి చదివాం. అయితే ఇప్పుడు మీరు చదవబోయేది మరింత భిన్నమైన వార్త. చనిపోయిన భార్యను మర్చిపోలేక.. ఆమెకు గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తున్నాడు ఓ భర్త. ఆ వివరాలు..
ఈ సంఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటు చేసుకుంది. గణేశపురం గ్రామానికి చెందిన పళనిస్వామి(75), సరస్వతి(59)లది అన్యోన్య దాంపత్యం. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వారికి వివాహాలయ్యి జీవితంలో స్థిర పడ్డారు. బాధ్యతలు తీరి.. ప్రశాంతంగా గడుపుదామనుకున్న సమయంలో పళనిస్వామి జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం అనగా 2019లో బాత్రూంకు వెళ్తున్న సరస్వతి.. అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. అన్నాళ్లు కలిసి కాపురం చేసి.. కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న భార్య.. అకస్మాత్తుగా మృతి చెందడాన్ని పళనిస్వామి జీర్ణించుకోలేకపోయాడు. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు.
ఈ క్రమంలో భార్య మరణించింది అనే విషయాన్ని మర్చిపోవడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు పళనిస్వామి. చనిపోయిన భార్యకు గుర్తుగా గుడి కట్టాలని నిర్ణియించుకున్నాడు. మొదటి వర్థంతి సందర్భంగా తోటలో తన భార్యను పూడ్చి పెట్టిన స్థలంలో గుడి నిర్మించాడు. భార్య మొదటి వర్థంతి సందర్భంగా భార్య సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఇక గత మూడేళ్లుగా పళనిస్వామి ప్రతి రోజు భార్య విగ్రహానికి రెండు సార్లు దీపం వెలిగించి పూజలు చేస్తున్నాడు. భార్యతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుని.. ఆ జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాను అంటున్నాడు పళనిస్వామి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.