క్షణికావేశంలో చేసిన తప్పులకు కొందరు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతుంటారు. భార్య, బిడ్డలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడుపుతుంటారు. తమ వారిని కలుకుని మనస్సు విప్పి మాట్లాడుకోవాలని అనుకుంటారు. కానీ జైల్లోని రూల్స్ ప్రకారమే కుటుుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా పంజాబ్ జైళ్ల శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి జైళ్లలో గడుపుతున్న ఖైదీలు తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పించింది. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చే దిశగా జైళ్లలో తరచూ పలు సంస్కరణలు ప్రవేశపెడుతూ ఉంటారు. అందులో భాగంగా పంజాబ్ జైళ్ల శాఖ 10 అడుగులు ముందుకేసిఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్ జైళ్ల శాఖ “పరివార్ ములాఖత్” పేరుతో ఖైదీల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జీవిత ఖైదీలుగా ఉన్న వ్యక్తులకు తన కోసం వచ్చే భార్య/భర్తలతో ఏకాంతంగా మాట్లాడేందుక అవకాశం ఉంటుంది. ఇందుకోసం జైలు ప్రాంగణంలో ప్రత్యేక గదులను సిద్ధం చేశారు. ఓ ఖైదీ తన భర్త/ భార్యతో ఆ గదిలోరెండు గంటల పాటు ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పించారు. ఈ గదులకు అటాచ్‌డ్ బాత్రూమ్‌లు ఉంటాయి. పంజాబ్ ప్రభుత్వం సెప్టెంబర్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బతిండా మహిళా జైలు, నభా జిల్లా జైలు, తర్న్ తరన్‌లోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మిగత ప్రాంతాల్లోని జైలు ప్రాంగణంలో ప్రత్యేక గదులు నిర్మించనున్నారు.
ఆ మూడు జైళ్ల నుంచి సెప్టెంబర్ 20 నాటికి 21 మంది.. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖైదీలకు పరివార్ ములాఖత్ ద్వారా వారి భాగస్వామితో కలిసేందుకు అవకాశం కల్పించనున్నట్లు పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ బెయిన్స్ తెలిపారు. అయితే జైళ్లలో ఉన్న తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలి అనుకునేవారు కొన్ని నిబంధనలు పాటించాలి. వారి పెళ్లికి సంబంధించిన ధ్రువపత్రం, కొవిడ్, లైంగిక సంబంధిత, ఇతర అంటువ్యాధులు లేవని వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానానికి కొన్ని పరిమితులు కూడా విధించారు.
కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్స్, అధిక ముప్పు ఉన్న ఖైదీలు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ అవకాశాన్ని కల్పించరు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే తమ భాగస్వామితో గడిపేందుకు అవకాశం కల్పించనున్నారు. అందులోనూ సుదీర్ఘ కాలంగా జైలు గడుపుతున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. జైళ్లలో ఇలాంటి విధానం అమలు చేయడం దేశంలో ఇదే తొలిసారి. మరి.. పంజాబ్ తీసుకొచ్చిన ఈ కొత్త కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.