ఈ మధ్య కాలంలో నవజాత శిశువులకు సంబంధించిన వింత సంఘటనలు అనేకం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారి తోకతో పుట్టిందని చదివాము. ఇక తాజాగా మరో వింత సంఘటన చోటు చేసుకుంది. నాలుగు కాళ్లతో చిన్నారి జన్మించింది. దాంతో ఈ సంఘటన కాస్త స్థానికంగా వైరల్‌గా మారింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్ గ్వాలియార్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా అనే మహిళ స్థానికంగా ఉన్న కమల రాజా ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆశ్చర్యంగా ఆ చిన్నారికి నాలుగు కాళ్లు ఉన్నాయి. దాంతో ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. వైద్య సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. అయితే చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాప బరువు 2.3కిలోగ్రాములు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే.. గ్వాలియర్‌లోని జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్‌తో పాటు మరికొందరు వైద్యుల బృందం వచ్చి.. శిశువును పరీక్షించింది. ఈ క్రమంలో జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ మాట్లాడుతూ..‘‘పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి, ఆమెకు శారీరక వైకల్యం ఉంది. పిండం రెండుగా విడిపోయినప్పుడు కవలలుగా మారతాయి. అయితే కొన్నిసార్లు ఇలా ఒకటే పిండానికి అదనపు శరీర భాగాలు అభివృద్ధి చెందుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో ఇస్కియోపాగస్ అంటారు. ఈ ఆడ శిశువు నడుము కింది భాగంలో అదనంగా రెండు కాళ్ళు అభివృద్ధి చెందాయి. అయితే ఆ రెండు కాళ్లు క్రియారహితంగా ఉన్నాయని’’ ఆమె తెలిపారు.
ప్రస్తుతం చిన్నారిని పిడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇక శిశువు శరీరంలో ఇంకా ఏవైనా ఇతర వైకల్యం ఉందా అని వైద్యులు పరీక్షిస్తున్నారు. వేరే సమస్యలు లేకపోతే.. శిశువుకు శస్త్ర చికిత్స చేసి.. అదనంగా ఉన్న కాళ్లను తొలగిస్తామని వైద్యులు తెలిపారు. దాని తర్వాత చిన్నారి.. మిగతా పిల్లలానే సాధారణ జీవితం గడపవచ్చని.. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.