సాధారణంగా మనకు వెయ్యి రూపాయల లాటరీ తగిలితేనే.. మన స్నేహితులు నువ్వురా అదృష్టవంతుడివి అంటే అంటూ.. పొగుడుతూ ఉంటారు. నిన్నగాక మెున్న ఇళ్లు జప్తుకు గురైన వ్యక్తి కి.. లాటరీలో లక్షల్లో జాక్ పాట్ తగిలిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఓ ఆటో వాలాకు కోట్లల్లో లాటరీ తగిలింది. తాజాగా మరోసారి ఈ లాటరీ వార్తల్లో నిలిచింది. భారతదేశానికి చెందిన వ్యక్తికి యూఏఈలో బిగ్ టికెట్ డ్రాలో కళ్లు చెదిరే జాక్ పాట్ తగిలింది. ఇక్కడ విశేషం ఏంటంటే? రేపు లాటరీ డ్రా తీస్తారు అనగా.. ఈ రోజు అతడు లాటరీ కొనుగోలు చేశాడు. దాంతో ఈ విషయం తెలిసిన వారంతా లక్కున్నోడు అంటే ఇతడేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
జయకుమార్ తిరునావుకరసు.. 2019 నుంచి యూఏఈ రాజధాని అయిన అబుదాబిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి అక్కడ నిర్వహించే బిగ్ టికెట్ లాటరీలో పాల్గొంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబర్ 16 న బిగ్ టికెట్ డ్రా లో లాటరీ కోనుగోలు చేశాడు. 17 తారీఖునే లాటరీ డ్రా ఉంది. తాజాగా ఈ డ్రాలో విజేతగా నిలిచాడు జయకుమార్. దాంతో ఏకంగా కేజీ బంగారాన్ని గెలుచుకున్నాడు. దాంతో అదృష్టం అంటే నీదే భయ్య అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఒక్క రోజు ముందు లాటరీ కొనడం ఏంటీ? ఆ లాటరీ అతడికే రావడం ఏంటీ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ అక్టోబర్ నెలలో బిగ్ టిక్కెట్ కోనే కస్టమర్లు యథావిధిగానే వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలోకి ప్రవేశిస్తారని యాజమాన్యం తెలిపింది. దాంతో ప్రతీవారం ఒక విజేత కేజీ బంగారాన్ని తమ ఇంటికి తీసుకెళ్లోచ్చని రాఫెల్ సంస్థ తెలిపింది. అదీ కాక 25 మిలియన్ల దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ కు సంబంధించిన లాటరీ డ్రా నవంబర్ 3 న ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బిగ్ టికెట్ లాటరీ కొనాలి అనుకునే వారు ఈ నెల 31వ తారిఖు వరకు ఆన్ లైన్ లో కొనుగోలు చేయోచ్చని నిర్వాహకులు తెలియజేశారు.