సాధారణంగా పాములు అడవుల్లో, పంటపొలాల్లో సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడ జనవాసాల మధ్యకి వస్తుంటాయి. ఇంకా ఈ మధ్యకాలంలో ద్విచక్రవాహనాల్లో, మనం ధరించే షూల్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే విమానాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే విమానాలను.. సిబ్బంది ఎంతో క్షుణంగా పరిశీలించిన తరువాత ప్రయాణికులను అనుమతిస్తారు. ప్రయాణికులు కూడా ఎంతో ధైర్యంగా జర్నీ చేస్తుంటారు. అయితే తాజాగా విమానంలో అందులోనూ విలాసవంతమైన బిజినెస్ క్లాస్ లో ఓ పాము ప్రత్యక్షమై.. అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సోమవారం యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన 2038 అనే విమానం అమెరికాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వెళ్తుంది. అయితే విమాన ప్రయాణం ముగించుకుని ల్యాండ్ అయిన సమయంలో ప్రయాణికులు బిజినెస్ క్లాస్ లో పామును గుర్తించారు. అకస్మాత్తుగా కనిపించిన ఈ పామును చూసి అందరు పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో సమాచారం అందుకున్న న్యూజెర్సీలోని న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొద్ది సమయం పాటు శ్రమించిన సిబ్బంది.. చివరకు ఆ పామును పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో కనిపించిన పామును కామన్ గ్రేటర్ జాతికి చెందిన స్నేక్ గా అధికారులు గుర్తించారు. ఈ జాతికి చెందిన పాములు ఫ్లోరిడాలో ఎక్కువగా సంచరిస్తుంటాయని, వీటికి విషం ఉండదని వన్యప్రాణి నిపుణులు పేర్కొన్నారు. ఈ పాము వలన మనిషికి ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇవి మనుషులపై అసలు దాడికి ప్రయత్నించవని అధికారులు వెల్లడించారు.
అయితే, ఆ పాము విమానంలోకి ఎలా వచ్చిందనే దానిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణికులను కిందికి దించామని, అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అనంతరం మరోసారి విమానంలో క్షుణ్ణంగా తనిఖీ చేశామని అధికారులు వెల్లడించారు. అయితే ఇలా విమానాల్లో పాములు ప్రత్యక్షమవడం అనేది ఇదేమి తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రథమంలో మలేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలో ప్రయాణికుడిపై ఉన్న లైట్ లో పాము కనిపించింది. ఆ సమయంలో పాము గాల్లోనే ఉంది. అప్పట్లో ఆ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక 2016లో ఎయిర్ మెక్సికో విమానంలో కూడా పాము కనిపించి.. ప్రయాణికులను హడలగొట్టింది.