హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కళారంగాన్ని సైతం ప్రభావితం చేసింది. ఓ అవార్డు స్పాన్సర్ అదానీ అని తెలిసి ఒక కవయిత్రి ఆ అవార్డు నాకొద్దు అంటూ తిరస్కరించారు.
ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కొన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చినందుకు, తమ రంగంలో సేవలు అందించినందుకు గాను అవార్డులు స్పాన్సర్ చేస్తుంటారు. అదానీ గ్రూప్ కూడా ఓ అవార్డుల కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించింది. దీంతో ఆ అవార్డు తీసుకోవడానికి ఒక మహిళ తిరస్కరించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ప్రతి ఏటా దేవి అవార్డ్స్ ని ప్రధానం చేస్తుంటుంది. దేశవ్యాప్తంగా తమ రంగంలో ఉత్తమ సేవలను అందించినందుకు గౌరవంగా 12 మంది మహిళలను ఎంపిక చేసి అవార్డులు ప్రధానం చేస్తుంటారు. ఈ క్రమంలో దేవి అవార్డుకు తమిళ కవయిత్రి సుకీర్తరాణి ఎంపిక అయ్యారు.
అయితే ఈ అవార్డు వేడుకను అదానీ గ్రూప్ స్పాన్సర్ చేస్తుందని తెలిసిన సుకీర్తరాణి.. ‘నాకు ఈ అవార్డు వద్దు’ అంటూ తిరస్కరించారు. అదానీ గ్రూప్ స్పాన్సర్ చేసిన ఈ అవార్డు తీసుకుంటే.. నేను కట్టుబడి ఉన్న ‘నా సిద్ధాంతాలకు, నా రచనలకు, నా తత్వాలకు విరుద్ధంగా నిలబడినట్టే’ అని ఆమె అన్నారు. తన ఫేస్ బుక్ పేజ్ లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈమె కవయిత్రి మాత్రమే కాదు, టీచర్, సామాజిక కార్యకర్త కూడా. లాలాపేట్, రాణిపేట్ జిల్లాల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమె దళిత సాహిత్యంపై ఎన్నో రచనలు చేసి గుర్తింపు పొందారు. సుకీర్తరాణి రచనలు.. దేశంలో ముఖ్యంగా తమిళనాడులోని దళిత మహిళల జీవితాలను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉంటాయి.
కైపట్రి ఎన్ కనవు కేల్, ఇరవు మిరుగం, కామత్తిపూ, తీన్డపడాథ ముత్తం, అవళై మోజిపేయర్థల్, ఇప్పడిక్కు ఎవల్ వంటి రచనలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈమె కవిత్వాలు కళాశాలల్లో బోధించబడుతున్నాయి. అంతేకాదు ఈమె రచనలు.. ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, హిందీ, జర్మన్ భాషల్లో కూడా అనువదించబడ్డాయి. అలాంటి కవయిత్రికి దేవి అవార్డు వారించినా.. ఆ అవార్డు ప్రధానోత్సవానికి అదానీ గ్రూప్ స్పాన్సర్ గా ఉందని తిరస్కరించారు. తాను మాట్లాడే రాజకీయాలకు, తాను నమ్మే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా.. అదానీ గ్రూప్ స్పాన్సర్ చేసే సంస్థ నుంచి గానీ లేదా ఈవెంట్ లో గానీ అవార్డు తీసుకోవడం అనేది తనకు సంతోషం కలిగించదని ఆమె అన్నారు.
ఆ అవార్డు ప్రధానోత్సవానికి అదానీ గ్రూప్ అనేది ఆర్థికంగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి తనకు వద్దు అంటూ ఆమె తిరస్కరించారు. ఈ అవార్డు ప్రధానోత్సవం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ లో జరిగింది. వివిధ రంగాల నుంచి సైంటిస్ట్ గగన్ దీప్ కంగ్. భరతనాట్యం డ్యాన్సర్ ప్రియదర్శిని గోవింద్, ఫిలాంత్రఫిస్ట్ రాధికా సంతాన కృష్ణ, స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్ప సహా మొత్తం 12 మంది మహిళలను దేవి అవార్డులకు ఎంపిక చేశారు. మరి కేవలం అదానీ గ్రూప్ స్పాన్సర్ చేసిందని తెలిసి ప్రతిష్టాత్మకమైన అవార్డును తిరస్కరించిన సుకీర్తరాణి నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా? లేదా? మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేయండి.