మన దేశాన్ని మాత్రమే కాక.. మొత్తంగా ఈ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ముందు వరుసలో ఉంటుంది. నిరుద్యోగం వెంబడి అనేక ఇతర సమస్యలు అలుముకుని ఉంటాయి. నిరుద్యోగం రేటు తగ్గితే దేశం కూడా వృద్ధి చెందుతుంది. ఇక తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఆదుకోవడం కోసం నెలకు 2500 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..
ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున ప్రధాన సమస్యల్లో ఒకటి పేదరింక అయితే.. మరొకటి నిరుద్యోగం. ఇవి రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. నిరుద్యోగం తగ్గితే.. పేదరికం కూడా తగ్గుతుంది. కరోనా తర్వాత మిగతా దేశాలతో పాటు మన దేశంలో కూడా నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చాలా కంపెనీలు.. లేఆఫ్ దిశగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు దొరికే వరకు వారికి నిరుద్యోగ భృతిని ప్రభుత్వాలే అందిస్తాయి. మన దేశంలో ఎన్నికల వేళ ఓటర్లు మరీ ముఖ్యంగా యువతను ఆకర్షించడం కోసం పార్టీలు.. తాము అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇస్తాయి. ఆ తర్వాత అవి ఆచరణలోకి రావు. బీఆర్‌ఎస్ పార్టీ 2018 ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ప్రకటించింది. కానీ ఇంత వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. ఏప్రిల్ 1 నుంచి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
ఏప్రిల్ 1, 2023 నుంచి నిరుద్యోగులకు నెలకు 2500 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నెలకు 2500 ఇవ్వనున్నారు. ఈమేరకు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ప్రకటించారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా అంగన్వాడీ వర్కర్లు, ఇతర ఉద్యోగులు జీతాలు పెంచుతామని ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్ యువత మాత్రమే ఈ నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు అవుతారు. 18-35 ఏళ్ల లోపు ఉండి.. ఇంటర్ పాస్ అయ్యి.. వారి కుటుంబ వార్షికాదాయం 2.50 లక్షలు మించని వారు ఈ నిరుద్యోగ భృతి పొండానికి అర్హులు. లబ్ధిదారులు.. స్థానికంగా ఉన్న ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులకు ప్రతి నెల 2500 వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అంతేకాక నిరుద్యోగ యువతకు వారి ఆసక్తులను బట్టి.. ఆయా రంగాల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఉపాధి పొందే వరకు ఈ నిరుద్యోగ భృతి అందజేస్తారు. మరి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.