ప్రభుత్వ ఉద్యోగం పట్ల యువతలో విపరీతైమన క్రేజ్ ఉంటుంది. చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం లభిస్తే ఇక జీవితం సెటిల్ అయినట్లే భావిస్తారు. అందుకే వాటికి అంత పోటీ ఉంటుంది. ఒక్క పోస్టు కోసం వేలల్లో పోటీ పడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత తేలికైన పని కాదు. ఎంతో శ్రమ.. మరి కాస్త అదృష్టం తోడైతే తప్ప.. గవర్నమెంట్ జాబ్ కొట్టలేం. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ఏళ్ల పాటు ప్రిపేర్ అవుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇక ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే.. చాలా గ్రేట్‌గా భావిస్తారు. అలాంటిది ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే.. ఆ తల్లిదండ్రుల ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. జాబ్ సాధించిన వారి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే కావడం విశేషం. ఆ వివరాలు..
బిహార్ దర్భంగా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నౌదేగా గ్రామానికి చెందిన సురేంద్ర లాల్‌దేవ్, అజయ్ కుమార్ ఇద్దరు అన్నదమ్ములు. సురేంద్రకు నేహా, షిప్రా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే అజయ్ కుమార్‌కు అనంత్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. వీరంతా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్నారు. ఇక మారథాన్ రన్నర్ అయిన సురేంద్ర లాల్‌దేవ్.. బిహార్ పోలీసు శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాగే అజయ్ కుమార్.. దర్భంగాలోని మధురాపూర్ మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. సోదరులు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తుండటంతో.. తమ తమ పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకునేవారు. అన్మదమ్ముల సంతానం ముగ్గురు కూడా ఎల్‌ఎల్‌ఎం వరకు చదువుకున్నారు.
ఇక పిల్లలు కూడా తమ తండ్రుల మాదిరే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆశయంగా పెట్టుకున్నారు. అందుకోసం ఎంతో శ్రమించారు. చివరకు ఆ ముగ్గురు ఏకకాలంలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడమే కాక.. తమ ఆశయాన్ని సాధించారు. ఈ ముగ్గురు తాజాగా బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నిర్వహించిన 31వ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తిర్ణులయ్యారు. దీనికి సంబంధించిన తుది ఫలితాలు సోమవారం అర్థరాత్రి విడుదలయ్యాయి. రిజల్ట్‌లో అన్నదమ్ములు సురేంద్ర లాల్‌దేవ్, అజయ్ కుమార్ ల పిల్లలు ముగ్గురి పేర్లు ఉన్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వీరంతా తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో.. ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ముగ్గురూ ప్రభుత్వ ఉన్నతోద్యోగాలు సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా ఈ ముగ్గురి గురించే చర్చించుకుంటున్నారు.