ఎక్కడ లేని వింతలన్నీ ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతాయేమో. లేకపోతే ఏంటండి. విచిత్రం కాకపోతే కడుపులో స్టీల్ సామాన్లు దొరుకుతున్నాయి. గ్లాసులు, స్పూన్లు వంటి స్టీల్ సామాన్లు కడుపులో ఉంటే వాటిని వైద్యులు బయటకి తీస్తున్నారు. గతంలో “ఒక వ్యక్తి కడుపులోంచి స్టీల్ గ్లాస్ ని ఆపరేషన్ చేసి తీసిన వైద్యులు” అనే వార్త చదివే ఉంటారు. ఆ గ్లాస్ ఎలా వెళ్లిందో అనేది స్పష్టత లేదు కానీ కింద నుంచి కోడ్తే కడుపులోకి వెళ్లిందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల అవుతుంది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కడుపులోంచి ఏకంగా 63 స్పూన్లను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకి తీశారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని మన్సూరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బోపాడా గ్రామానికి చెందిన విజయ్.. మత్తు పదార్ధాలకు బానిస అయ్యాడు. దీంతో అతన్ని ఆ వ్యసనం నుంచి దూరం చేసేందుకు కుటుంబ సభ్యులు షామ్లీలోని డ్రాగ్ డీఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేశారు. అక్కడ ఒక నెల రోజుల పాటు చికిత్స చేశారు వైద్యులు. అయితే డీఅడిక్షన్ సెంటర్ లో చికిత్స పొందుతుండగా ఉన్నట్టుండి విజయ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు విజయ్ ని.. ముజఫర్ నగర్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. విజయ్ కి పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు.
వైద్యులు విజయ్ కి ఆపరేషన్ చేయగా ఒక్కసారిగా కంగు తిన్నారు. కడుపులో 63 స్పూన్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని కడుపులోంచి బయటకు తీశారు. అయితే విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆ స్పూన్లు విజయ్ కడుపులోకి ఎలా వచ్చాయని వైద్యులు ఆరా తీస్తున్నారు. అయితే డీఅడిక్షన్ సెంటర్ సిబ్బందే విజయ్ కి బలవంతంగా స్పూన్లు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో విజయ్ మాత్రం నోరు మెదపడం లేదు. డీఅడిక్షన్ సెంటర్ సిబ్బందే ఇలా చేశాడో లేక ఆకలేసి విజయ్ ఏ తినేశాడో అనేది సస్పెన్స్ గా మారింది. కడుపులో ఒక స్పూన్ పట్టడమే కష్టం. అలాంటిది ఏకంగా 63 స్పూన్లు పట్టాయంటే వింతే మరి. అక్కడ స్పేస్ లేదు, కానీ డీఅడిక్షన్ సెంటర్ సిబ్బంది లేదా విజయ్.. ఈ ఇద్దరిలో ఒకరు స్పేస్ క్రియేట్ చేసుకున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా గానీ ఇలాంటి ఘటనలు కూసింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.