కొందరు స్మగ్లర్లు సముద్రం మార్గం ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను పాకిస్థాన్ నుంచి భారత్ లో సరఫరా చేస్తుంటారు. పోలీసులు, సముద్ర తీర నౌకాదళం ఎప్పటికప్పుడు ఈ ముఠాలను అరెస్టు చేస్తుంటారు. అయిన అధికారుల కళ్లుగప్పి దేశంలోకి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. తాజాగా గుజరాత్ తీరంలో మరోసారి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.200కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రం గుండా భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకున్నారు. అందులో రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కచ్ జిల్లా జకావ్ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే బోటులో హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు కోస్ట్ గార్డు, ఏటీఎస్ సిబ్బంది గుర్తించారు. సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అధికారులు.. ఆరుగురు పాకిస్థానీలను అరెస్టు చేసి బోటును సీజ్ చేశారు. సముద్రమార్గం ద్వారా మాదక ద్రవ్యాలను గుజరాత్ తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పంజాబ్ తరలించాలనుకున్నారని అధికారులు వెల్లడించారు.