ప్రేమించిన యువతిని పొందడం కోసం నెలరోజుల్లోనే లక్షలు సంపాదించడం.. కొండలు పిండి చేయడం.. అసాధ్యం అనుకున్న ఫీట్లను సాధించడం వంటివి సినిమాల్లోనే చూస్తాం. వాస్తవ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదు. నూటికో కోటికో.. ఎక్కడో ఒక చోట అలాంటి వారు తారసపడుతుంటారు. వారు ప్రేమించిన వ్యక్తి కోసం జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. ఆ వ్యక్తి శాంసంగ్ కంపెనీలో కోట్ల రూపాయల వేతనం వచ్చే కొలువులో ఉన్నాడు. మంచి జీతం.. ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు.. తోడుగా మనసుకు నచ్చిన నెచ్చెలి. జీవితానికి ఇంకేం కావాలి అనుకుంటాం కదా.
కానీ ఆ యువకుడి జీవితంలో మాత్రం.. వీటితో పాటు మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. మాటల సందర్భంలో ప్రియురాలు కోరిన కోరిక తీర్చడం కోట్ల రూపాయలు వేతనం వచ్చే ఉద్యోగం వదిలి.. కష్టపడి చదివి.. కలెక్టర్ అయ్యాడు. అతడి ప్రేమ గురించి తెలిసిన వారంతా.. నిజమైన ప్రేమకు నిర్వచనం మీరిద్దరూ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి వారి ప్రేమ కథపై మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రస్తుతం కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కనిష్క్ కటారియా ప్రేమ కథ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చదువు పూర్తి చేసుకున్న తర్వాత.. కనిష్క్‌కి శాంసంగ్ కంపెనీలో.. కోట్ల రూపాయల వేతనంతో ఉద్యోగం వచ్చింది. సౌత్ కొరియాలో జాబ్ చేసేవాడు. అతడి ప్రియురాలు సోనల్ కూడా కొరియాలో ఉద్యోగం చేస్తుంది. ఓ రోజు ఇద్దరు డిన్నర్ చేయడం కోసం రెస్టారెంట్‌కు వెళ్లారు. భోజనం చేస్తూ.. తమ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటున్నారు.
మాటల సందర్భంలో కనిష్క్.. సోనల్‌ని ఉద్దేశించి.. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే.. నేను ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సోనల్.. నిన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలని అనుకుంటున్నాను అంటుంది. ప్రియురాలి కోరిక తీర్చడం తన బాధ్యత అనుకున్న కనిష్క్.. సరే అని మాట ఇస్తాడు. అయితే సివిల్స్‌కు ప్రిపేరవ్వడం అంటే ఆషామాషి కాదు. ఆ విషయం కనిక్క్‌కు కూడా తెలుసు. ఎందుకంటే.. అతడి తండ్రి.. సివిల్ సర్వీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కనుక దాని గురించి కనిష్క్‌కు పూర్తిగా తెలుసు.
అయితే ప్రియురాలికి ఇచ్చిన మాట నిలబెట్టేందుకు.. ఎంత కష్టమైన భరించేందుకు సిద్ధపడ్డాడు కనిష్క్. ఈ క్రమంలో కోట్ల రూపాయల వేతనం వచ్చే కొలువును వదిలేసి.. సివిల్స్‌కు ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా తనకెంతో ఇష్టమైన మ్యాథ్స్‌ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 సివిల్స్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించాడు. ట్రైనింగ్ పూర్తవ్వగానే ప్రియురాలు సోనల్‌ని వివాహం చేసుకున్నాడు. అతడి విజయం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ప్రేమిస్తే.. జీవితాలు నాశనం చేసుకునేవారిని ఎక్కువగా చూస్తున్నాం. అలాంటిది.. ప్రియురాలి కోసం ఏకంగా కలెక్టర్ కొలువు సాధించి.. నిజమైన ప్రేమకు, ప్రేమికుడికి నిదర్శనంగా నిలిచాడు కనిష్క్. ప్రేమికుడంటే కనిష్క్‌లానే ఉండాలి అవునా.. కాదా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.