అనంతపురం- అతివేగం ప్రమాద కరం.. నిదానమే ప్రదానం.. అని నినాదం. అంతే కాదు ఈ నినాదంతో కూడిన సైన్ బోర్టులను ప్రభుత్వం రోడ్ల వెంట ఏర్పాటు చేసింది కూడా. కానీ ఎవరైనా ఈ నినాదాన్ని పాటిస్తే కదా. అందుకే అతి వేగం చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు.
ఇదిగో అతివేగం కారణంగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊరుకొండ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టడంచో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ పెళ్లి వేడుక కోసం ఇన్నోవా కారులో బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతులు ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.
ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో అశోక్ (బొమ్మణహల్), సరస్వతి (బొమ్మణహల్), రాధమ్మ (బొమ్మణహల్), శివమ్మ (పిల్లలపల్లి), శుభద్రమ్మ (రాయల దొడ్డి), స్వాతి (లత్తవరం), జాహ్నవి (లత్తవరం), వెంకటప్ప (నింబగల్లు) ఉన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.