‘సీతారామం’ తాజాగా సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సినిమా. 1965లో భర్త రాసిన ఉత్తరం.. 20 ఏళ్ల తర్వాత భార్యకు చేరుతుంది. అచ్చం ఇలాంటి కథే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే అది లవర్స్ మధ్య కాదు సుమీ.. 42 సంవత్సరాల క్రితం చెల్లి తన అక్కకు రాసిన ఉత్తరం.. తాజాగా ఆమెకు అందబోతోంది. దీంతో అక్క సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 22 సంవత్సరాలు ఉన్నప్పుడు అందుకోవాల్సిన ఉత్తరాన్ని 64 వ పడిలో అందుకోబోతోంది. సీతారామం సినిమా లాగా ఉన్న ఈ కథ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. మన బంధువులతో ఏకంగా వీడియో కాలే మాట్లాడుకోవచ్చు. కానీ పూర్వం అలా కాదు. వారు మాట్లాడుకోవాలి అంటే వారికి ఉన్న సదుపాయం అల్లా పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం రాయడమే. అలాగే ఉత్తరం రాసిందో మహిళ. వివరాల్లోకి వెళితే.. నెదర్లాండ్స్ లోని దక్షిణ ప్రావిన్స్ కు చెందిన వెరోనికా, జాన్ మత్తిజ్స్ దంపతులు. వెరోనికా తన అక్క అయిన లుద్వినా వెర్హోవెన్ కు 1980లో ఓ ఉత్తరాన్ని రాసింది. ఆ ఉత్తరం ఇప్పటి వరకు ఆమెకు చేరలేదు. తాజాగా సదరు ఉత్తరం ఆమెకు చేరబోతుంది అని పోస్ట్ ఆఫీస్ కు చెందిన అధికారులు ఆమెకు సమాచారం ఇచ్చారు. దాంతో వెర్హోవెన్ ఆద్వేగానికి గురవుతోంది. తనకు 22 ఏళ్ల వయసులో అందాల్సిన ఉత్తరం 42 సంవత్సరాల తర్వాత తన 64వ సంవత్సరంలో అందుతున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
ఈ ఉత్తరం గురించి ఆమె స్పందిస్తూ..”ఉత్తరం పై సంతకం చేసిన తన చెల్లెలు, మరిది చనిపోయారని ఆమె వివరించింది. ఆ ఉత్తరం పై సరిగ్గా అడ్రస్ లేనందునే.. అది వేరే చోటుకు చేరిందని డచ్ పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ కార్డు ధ్వంసం కాలేదని.. ఇప్పటికీ అలాగే ఉందని వారు తెలిపారు. దాన్ని వెంటనే లుద్వినా వెర్హోవెన్ కు అందజేస్తామని అధికారు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సరదాగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.”నిజ జీవితం నుంచే కథలు పుడతాయి.. అనడానికి ఇది రుజువు”, 64 ఏళ్ల వృద్ధురాలికి సంతోషాన్ని అందిస్తున్నారు మీకు ధన్యవాదాలు అంటూ కొందరు రాయగా.. సీతారామం సినిమా రిపీట్ అయ్యింది”అని మరికొందరు రాసుకొచ్చారు.