ముంబయి- టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. కస్టమ్స్ అధికారులు పాండ్యాకు జలక్ ఇచ్చారు. లెక్కల్లో లేని అతి ఖరీదైన వాచ్ లను అధికారులు సీజ్ చేశారు. హార్ధిక్ పాండ్యా దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత పాండ్యా దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వస్తున్న క్రమంలో ముంబయి ఎయిర్ పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సదరు వాచీలకు సంబంధించిన ఇన్ వాయిస్ లు పాండ్యా చూపకపోవడంతో ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడిని ఆపిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
హార్ధిక్ పాండ్యా నుంచి కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్న ఈ వాచ్ ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ఒకటి. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్‌తో తయారుచేయబడినది.
ఈ వాచ్ లో 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్ లెట్ కూడా ఉంటుంది. ఈ వాచ్ మరో ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్‌ను తయారు చేసి ఇస్తారు. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ ఖరీదైన వాచీని ధరించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2021లో పేలవ ప్రదర్శనతో పాండ్యా విమర్శలు మూటగట్టుకున్నాడు.