హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. వినాయక చవితి శక్రవారం రోడు రాత్రి హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యలు చెప్పారు.
ఇక సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగానే ఆ వార్త మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు, సోషల్ మీడియా అంతా సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ పైనే దృష్టి పెట్టాయి. గంట గంటకు లైవ్ బులిటెన్స్ తో ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై వార్తలను ప్రసారం చేశారు. దీంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో సాయి ధరమ్ తేజ్ ప్రమాదమే వార్తగా మారిపోయింది.
ఇందులో తప్పుబట్టాల్సింది ఏంలేదనుకొండి. సినిమా నటుడు కావడం, మెగాస్టార్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మీడియా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం, ఆయన ఆరోగ్యంపై కాస్త ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ ఇదే సమయంలో హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీలు ఓ ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కానీ ఇదే మీడియా ఆ చిన్నారి అత్యాచార, హత్య ఘటనను అంతగా సీరియస్ గా తీసుకోలేదని కొంత మంది వాదిస్తున్నారు.
ఆ చిన్నారి గిరిజన బాలిక కావడమే ఇందుకు కారణమని నిందిస్తున్నారు. ఈమేరకు మీడియా అంతా దృష్టి పెట్టిన సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చిన కొందరు యువకులు నిరసన తెలిపారు. సాయి ధరమ్ తేజ్ కు ఇచ్చిన ప్రాముఖ్యత, ఓ గిరిజన చిన్నారి అత్యాచారానికి ఎందుకు ఇవ్వలేదని నిలదీశాారు. కనీసం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదని ఆ యువకులు మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.