ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. సినీ ప్రముఖుల వారసులు భారీగా తెరంగేట్రం చేస్తున్నారు. ఐతే ఇలా వచ్చిన వారసులు ఎంతమేర పరిశ్రమలో నిలదొక్కుకుంటారంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే సినీ వారసుల్లో కొంత మంది సక్సెస్ వస్తే.. చాలా మంది ఇలా వచ్చి, అలా వెళ్లిన వాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అశ్వద్ధామ మూవీ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు అతి సర్వత్ర వర్జయత్ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది కిన్నెరసాని. ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా.. చివరకు ప్రేమకైనా.. అనే డైలాగ్ ఆకట్టుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ అందించిన నేపథ్య సంగీతం బావుంది. కళ్యాణ్ దేవ్ వేద అనే పాత్రలో కనిపించనున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్కుంటున్న కిన్నెరసానిని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అన్నట్లు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో పాటే సూపర్ మచ్చి అనే మరో సినిమాలో నటిస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కధా చర్చల్లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.