పెళ్లంటే అటు ఏడు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. గుణగణాలతో పాటు.. ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి. అప్పు చేసైనా సరే.. ఆర్థిక ఇబ్బందులు లేని ఇంటికే తమ బిడ్డను ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సామాన్యులే ఇలా ఆలోచిస్తే.. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పక్కర్లేదు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తులనే పెళ్లాడతారు. అయితే తన విషయంలో మాత్రం రివర్స్‌లో జరిగింది అంటున్నారు సీనియర్ నటి తులసి. తాను ఓ పేద వ్యక్తిని పెళ్లి చేసుకున్నాని.. ఇక తన అత్తగారు పాచి పని చేసేదని.. తను కోడలిగా అడుగుపెట్టాకే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగయ్యిందని చెప్పుకొచ్చింది. అంతేకాక తన జీవితంలో సాయి బాబా చేసిన అద్భుతాలను కూడా వివరించింది. తులసి ప్రధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ శివమణితో నా వివాహం.. ఒక్క రోజులోనే జరిగిపోయింది. బెంగళూరులో మా తాత కట్టించిన బాబా ఆలయంలో ఎంతో సింపుల్‌గా మా పెళ్లి జరిగింది. మా వివాహం అయ్యే నాటికి ఆయన చాలా పేదరికంలో ఉన్నాడు. మా అత్తగారు పాచినని చేసేది. నేను కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టాకే వారికి కలిసి వచ్చింది. మా ఆయన తీసిన కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి అంతలా దిగజారింది. అప్పలుపాలయ్యారు’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఇక వివాహం తర్వాత నేను రాసిన మిణుగు తార అనే కథని మేమే సినిమాగా నిర్మించాం. అది మంచి విజయం సాధించడమే కాక.. ఏకంగా 13 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు మా ఆయన.. ఈ చిత్రం హిట్టయితే.. బాబా గుడిలోపల ప్రభావళి చేస్తానని మొక్కుకున్నాడు. హిట్ అయ్యి.. భారీగా డబ్బు వచ్చాక ఆయన మొక్కు తీర్చుకోలేదు. ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ.. వచ్చిన డబ్బంతా పోయింది. చాలా ఆలస్యంగా మా ఆయన మొక్కు తీర్చుకున్నాడు. ఇక నేను మొదట్లో సాయి బాబాను నమ్మేదాన్ని కాదు. నా తమ్ముడు అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పుడు నేను బాబాను చాలా తిట్టుకున్నాను.. ఎంతో బాధపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఇలా ఉండగా ఓ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాబా నా గదిలోకి వచ్చి.. అమ్మా అని పిలిచాడు. అంతేకాక గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లివి. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే.. ఆరేళ్లకు నాకు ఓ కొడుకు పుట్టాడు. అంత బాబా దయ అనే భావించి.. నా కొడుక్కికి సాయి అనే పేరు పెట్టుకున్నానను’’ అని చెప్పింది. ఇక ఏడాదిన్నర వయసులోనే తులసి బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. భార్య చిత్రంలో రాజబాబు కొడుకుగా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి.. సీతా మహాలక్ష్మి, శంకారాభరణం సినిమాల్లో పోషించిన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. డార్లింగ్ చిత్రంలో ఇంగ్లీష్ రాని తల్లి పాత్రలో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది తులసి.