కొన్నేళ్లుగా ఇండియాలో హిట్టయిన సినిమాలను వేరే దేశాల భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు సౌత్ సినిమాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం జపాన్, చైనా, రష్యా లాంటి దేశాలలో రిలీజ్ అవ్వడం చూశాం. ఒకప్పుడు జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ముత్తు’.. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లాంటివి బాగా ఆడాయని.. చైనాలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ మూవీ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని విన్నాం. అంతెందుకు రష్యా వాళ్ళు బాహుబలి సినిమాని వాళ్ళ భాషలోకి డబ్ చేసుకొని రిలీజ్ చేసుకున్నారు. తెలుగు ఫ్యాన్స్ అంతా మన సినిమాని రష్యా వాళ్లే డబ్ చేసుకోవడంపై ఎంతో సంతోషించారు.
ఇటీవల అదే రష్యాలో అనువాదమై విడుదలైన సినిమా ‘పుష్ప’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ మూవీ.. 2021లో ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక సినిమాలో సాంగ్స్ తో పాటు అల్లు అర్జున్ యాటిట్యూడ్, డైలాగ్స్, రష్మిక గ్లామర్.. సినిమాటోగ్రఫీ.. ఇలా అన్నివిధాలా మంచి పేరు, అవార్డులు సంపాదించుకుంది పుష్ప. అదీగాక పుష్ప రిలీజ్ అయ్యాక ఇండియాతో పాటు విదేశాలలో కూడా సినిమా లవర్స్ అంతా పుష్ప ‘తగ్గేదే లే’ అనే సిగ్నేచర్ ని, శ్రీవల్లి స్టెప్ ని చాలా పాపులర్ చేశారు. అయితే.. ఇవన్నీ ఇండియాలో వర్కౌట్ అయినట్లుగా రష్యాలో అవ్వలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అవును.. డిసెంబర్ 8న రష్యన్ భాషలో పుష్ప డబ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ ముందు ప్రమోషన్స్ కోసం హీరో అల్లు అర్జున్, రష్మిక మందాన, సుకుమార్ లతో పాటు నిర్మాతలు కూడా రష్యాకి వెళ్లారు. అన్ని విధాలా ప్రమోషన్స్ చేశారు. అయితే.. పుష్ప ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ. 3 కోట్లు ఖర్చు పెట్టారట నిర్మాతలు. కట్ చేస్తే.. సినిమాని మూడు రోజుల్లోనే థియేటర్స్ లో నుండి తొలగించారని సమాచారం. పైగా.. ప్రమోషన్స్ కి పెట్టిన ఖర్చులు కూడా సినిమా వసూల్ చేయలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2021 డిసెంబర్ లో విడుదలైన సినిమాని.. ఏడాది తర్వాత అదే డిసెంబర్ లో రష్యాలో రిలీజ్ చేశారు. మరి పుష్పని రష్యాలో రిలీజ్ చేయడం వల్ల మేకర్స్ కి రూ. 3 కోట్లు నష్టం తప్పలేదని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. చూడాలి మరి పుష్ప 2 ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో! ఇక పుష్పని రష్యన్ భాషలో రిలీజ్ చేయడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.